పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనగీతామృతతోషితద్విరదరాట్చర్మాంబరుం దుంబురున్
వినయప్రౌఢిమఁ జేరఁబోయి నతి గావించెం బ్రమోదంబునన్.

97


చ.

అపు డమరేంద్రగాయనుఁ డనన్యజసోదరభావసూచనా
నిపుణతనూవిలాసు నతనిం గని యెచ్చటనుండి వచ్చి తే
నృపతనయుండ వేమికత మిచ్చటికిం జనుదేర నంచు స
త్కృప నడుగ న్యదూద్వహుఁడు దీపితసూనృతసూక్తి ని ట్లనున్.

98


సీ.

కరగతచక్రుండు హరిబలాన్వితుఁడు సన్మహితవిక్రముడు మామకగురుండు
ప్రాణేశకలితసురాగసంస్తుత్యసత్యాఖ్యాతగోత్ర నాయనుఁగుజనని
సరసధర్మధురీణుఁ డురుసుమనోమార్గణావలంబనుఁడు నాయగ్రజన్ముఁ
డక్రూరసుగుణోద్ధవాధారశూరసంతానశేఖరులు మద్బంధుజనులు
పొదలురాలచ్చి యెపుడు మాయదుకులమున
మాకు రత్నాకరపురోత్తమము నివాస
మట్టినే నీకు నిచట శిష్యత వహించి
వీణ నేర్వంగ వచ్చితి విమలచరిత.

99


గీ.

అనుచుఁ జతురోక్తిఁ దెలిపిన విని తదీయ, వృత్త మఖిలము మనమున నెఱిఁగి తుంబు
రుం డతని గారవించి యారుక్మబాహు, నృపతనూభవుతో వీణ నేర్చుచుండె.

100


ఉ.

అంత దిగంతదంతురలతాంతనిశాంతనితాంతకాంతన
న్యాంతికతాంతపాంథజనతాంతరసంతతకృంతనప్రథా
త్యంతసమంతతస్స్ఫురదుదంతపరంతపకాంతిసంతతి
క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్.

101


[1]క.

వనలక్ష్మి మాధవాగతి, కనువుగఁ బూనీట జలకమాడుటకై ముం
దనువున నలుఁగిడఁగా ను, ర్లినచిక్కస మనఁగ ధరఁ దొరిఁగెఁ గారాకుల్.

102


ఉ.

పూని వసంతహాళికుఁడు పొంగెడురాగగరసంబుచే గడు
న్నానుజనాళిమానసపునట్టులు దున్ని మనోజకందళిం
గానఁగఁ జేసి యంత నెగఁగట్టినయట్టిహలంబులో యనం
గా నెఱసెం బలాశకళిక ల్మునుమున్న వనాంతరంబులన్.

103


క.

ఎలఁదీవెచెలులు నలిగా, డ్పులపైఁ దేనియవసంతములు చల్లఁగఁ చే
తులఁ బూనినవేత్రపుఁది, త్తులు నాఁ దలిరాకుపొదలఁ దోఁచె న్మొగ్గల్.

104
  1. ట-లో లేదు.