పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

తృతీయాశ్వాసము

క.

శ్రీదత్తాత్రేయ సదా, మోదితసకలాదితేయ మునిగేయ చిదా
స్వాదాప్రమేయ యనసూ, యాదేవీశుక్తిమౌక్తికానఘకాయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


గీ.

అచట హితుఁ జూచి హరిసుతుం డనియె మనల
కిచట మ్రొక్కంగఁ జన దేవుఁ డెదురువచ్చె
మునివచనభంగి రెం డొకపనియ గాఁగఁ
[1]దెలిపెఁ గుండినమునకుఁ బోవలయు మనకు.

3


క.

మనవీరసేనునకుఁ గుం, డినమునఁ దుంబురుఁడు వీణ నేర్పెడునఁట యా
తనియనుజ యొకతె కుముదిని, యనఁ గలదఁట కార్యసిద్ధి యగు మన కచటన్.

4


[2]ఉ.

కావునఁ బంచసాయకుఁడు గంజభవాత్మజుచేతఁ గానవి
ద్యావిదుఁ డై ప్రసిద్ధిఁ గనునంతకు మున్నుగ నేగి గేయలీ
లావిధు లెల్లఁ జాలఁ బదిలంబుగ నేరిచి యెట్టులైన నే
నావనజాక్షిఁ దెచ్చెద సఖా యట కీవును సంభ్రమంబునన్.

5


క.

నావెంటనె ర మ్మిఁక మన, మీవిధము పురంబుఁ జేర నేగి హరికి స
త్యావనితకు నెఱిఁగించినఁ, [3]బోవఁగనీ రిదియ వెడలిపోఁ దఱి యనినన్.

6


చ.

అతఁడును నట్లకాక యన నప్పుడ వా రసహాయశూరు లై
ప్రతిదివసప్రయాణములు బట్టనపక్కణదుర్గదుర్గమా
యతతటినీవనీగిరు లనంతము లొక్కట దాఁటి పోయి రు
ద్ధతగతి నంత నిచ్చటఁ దదాప్తచమూనివహంబు లెంతయున్.

7


చ.

క్రమమున నెల్లెడ న్వెదకి కానక క్రమ్మఱిపోయి యయ్యదూ
త్తమునకు విన్నవించుటయుఁ దత్ప్రమదాసుతబాంధవాప్తవ
ర్గము లడ లొంది భావిశుభకార్యము నారదుచే నెఱింగి హృ
త్ప్రమదముఁ గాంచె నిచ్చట నృపాలకుమారవతంసు లొక్కెడన్.

8
  1. చ-దెలిసి
  2. ట-లో లేదు.
  3. చ-బోవఁగనీ రిపుడ వెడలిపోవుద మనినన్.