పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సమదగతి నిగిడిచిన వ్య, ర్థము లై శతధాసహస్రధా నానాళీ
కములెల్లన్ జనియెను దళి, తము లై చట్రాయి వానితలఁపు కటకటా·

171


సీ.

[1]వెలవెలఁ బాఱెడువేళఁ బెన్గట్టు క్రేవలఁ బట్టి కుందెడువాని నమ్మి
వనములపాలయి మునుపున్నదళముల వదలి జాతికిఁ బాయువాని నమ్మి
తనరాకపోకలు గననీక మాయ మై వడఁకుచు వర్తించువాని నమ్మి
కొమ్మలలోఁ డాఁగి కొదికి లావులు డాఁచి వంచినతల లూఁచువాని నమ్మి
కటకటా దేవసభలోనఁ గండక్రొవ్వు
మాటలాడితిఁ గాని యీపాటివారె
యాప్తులని యెంచలేనైతి [2]నపజయంబు
పాల్పడితి నంచుఁ జనియె నాభావభవుఁడు.

172


క.

ఆచంద్రరేఖయును ద, ద్వాచంయమిశాప మెనసి వసుధ నవసుధా
రోచి యగురుక్మబాహు, క్ష్మాచక్రేశ్వరునకుం గుమారిక యయ్యెన్.

173


శా.

ఆవృత్తాంత మశేషము న్విబుధలోకాధీశుఁ డేతద్వయ
స్యావాక్యంబుల నాలకించి సురకార్యాపన్న కావేలుపుం
బూవుంబోణికి ధాత్రి నామరపురీభోగోన్నతు ల్గల్గఁ జే
తోవీథిం గరుణించి పంచె శుభగీతు ల్నేర్పఁగాఁ దుంబురున్.

174


శా.

ఆగంధర్వుఁడు వచ్చి నాఁటగొలె నత్యానందసంయుక్తుఁ డై
రాగప్రౌఢిమ మీఱ గీతములు నేర్ప న్వేడ్క నే నమ్మహా
భాగుం గన్గొన నేగి యిప్పు డతఁ డంపన్సహ్యకన్యాతటీ
భాగావాసుని రంగనాయకుని సంప్రార్థింపఁగా నేగెదన్.

175


క.

అని పలికి విజయలోలువ, చనముల నాచంద్రభానుచర్య సకలమున్
విని ముని సమ్మదయుతుఁ డై, పనివినియెం బిదప సత్యభామాసుతుఁడున్.

176


మ.

సకలక్ష్మాతల[3]పుణ్యగణ్యపురవీక్షాదక్షుఁ డైనట్టిమౌ
నికులోత్తంసము వాగ్విలాసములు వింటే నెచ్చెలీ యెందు ని
ట్టికృతార్థుం గనుఁగొంటిమే యితనిసాటిం బల్క నిద్ధాత్రిలో
నొకసిద్ధుండును లేఁడు పో యనుచు సత్యుత్కంఠితస్వాంతుఁ డై.

177
  1. ట-వెలవెలఁ బాఱుచు వేగ బెన్ గట్టు క్రేవం బడి
  2. చ-ట-నపయశంబు
  3. ట-చక్రపుణ్యపుర