పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నకట యంతటిలోనె యొండొకటి మీఱి
తత్తఱము మోహమును దిట్టతనము గాఁగ
నఖిలమౌనులు వెఱగంద నరుగుదెంచి
ధరణితలనాథ మునిఁ గఱకఱి యొనర్చె.

163


క.

అతనుశరవర్షధారా, హతి నిట్లు మహాజడాశయం బవిసిన నా
యతి యతులబోధసేతు, ప్రతినవయత్నమున నిల్పి పటువిస్మయుఁ డై.

164


మ.

తనవిజ్ఞాననిరీక్షణస్ఫురణ నత్యంతంబు నూహించి త
ద్వనితాసన్నిధిదోషరోషభరనృత్యద్భ్రూయుగాభీలుఁ డై
ముని [1]కన్దోయి మిడుంగులు ల్గురియ సంభూతశ్రమాంభోనిగుం
భనగర్ణాయుతహుంక్రియార్భటి జనింపం గంపమానోష్ఠుఁ డై.

165


ఉ.

త్రాస మొకింత లేక సవిధంబునఁ గారులు పల్కెదేల యో
సోసి మదాంధురాల తలవోసి [2]భవన్నుతజాతిగర్వరే
ఖాసముదగ్రవైభవవికారము లిప్డ యడంతు నంచుఁ బే
రీసువడి న్శపించె నల యింతి నరాంగన యై జనింపఁగన్.

166


క.

ఈకరణి నమ్మహర్షివి, భాకరు నెఱిమినుకుల న్స్వబంధురకాంతి
శ్రీకామనీయకవిశూ, న్యాకృతి యై చంద్రరేఖ యడలుచుఁ జనియెన్.

167


సీ.

అరయ ననగ్నికుండాహుతిస్తోమ మై బూదిఁ గూడె సుమాస్త్రుపోఁడిమెల్లఁ
జర్చింప నూపరస్థాపితబీజ మై ధూళిఁ గూడె సమీరుహాళి యెల్లఁ
జింతింప వఱదఁ గూర్చినచింతపం డయి నీటఁగూడె హిమాంశునేర్పు లెల్లఁ
గనుఁగొన నడవిని గాచిన వెన్నె లై చెట్లఁ గూడె వసంతుచెల్వ మెల్ల
నకట చట్రాతిపై వాన యగుచుఁ జెదరి, పఱచె నలువంకలకుఁ బక్షిబలము లెల్ల
విశ్వభూనాథ విను పదివేలమంది, మన్మథులకైన వాని దెమల్ప వశమె.

168


క.

ఆవేళ వాలుఁ బోవం, గా వైచి లతాంతశరుఁడు కట్టా మునుము
న్నీవిధ మరయక [3]యిట్టులు, రావచ్చునె మనసు కావరంబున ననుచున్.

169


క.

వెనువెనుకకుఁ జని యొకపూ, చినసంపెఁగకొమ్మ రెండుచేతుల నవలం
బనముగ నొనరిచి పదముల, నెనయించినదృష్టి మస్త మెత్తక తనలోన్.

170
  1. క-కన్గొన
  2. చ-భవత్సురజాతి
  3. చ-ట-నాకున్