పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కాయజుఁ డల్లిపూబొమిడికం బిడి గేదఁగిఱేకుబాఁకుదా
రా యమరించి కల్వలజిరాపయి లేఁజిగురాకుచొక్కపుం
జాయల జాళువాకమరు చాల బిగించి ద్విజాళి మ్రోల జే
జే యన మందగంధవహశీతకరాదులు సందడింపఁగన్.

156


ఉ.

ఱెక్కలతేజి నెక్కి ననఱేకుమిటారపువంకి సూటిగాఁ
చెక్కి బళీ యనం దరటుసేసి ఘడాఘడి రెండువీథులం
జక్కఁగ నూఁకినం జెమట జాఱ నొకించుక వన్నె సోఁకినం
ద్రొక్కినచోట్లు ద్రొక్కనిమరుం గని పల్మఱు మస్తరించుడున్.

157


ఉ.

తోడన నూఁకి మల్లెననతూపులఁ గూడఁగ నేసి మర్మముల్
గాఁడఁగ మొల్లపూగొఱకలం జుఱుకంటఁగ నించి తమ్మిపె
న్గేడెము చాఁటుచేసి తొవనేజముకొల్దికిఁ గ్రుమ్మి దిక్కు ల
ల్లాడఁగ జా పూసబళ మంది ఘనధ్వని మీఱ నార్చుచున్.

158


ఉ.

పూవిలుకాఁడు కీరహయము న్ముని నంటఁగఁ దోలి నిల్పి తాఁ
బావడ లూఁది త్రొక్కి పరిపాటిగ ముందఱ సాఁగి నిక్కి ముం
జేవడిఁ జూఁపి యాఘనునిచిత్తము లక్ష్యము చేసి వైచె గా
త్రావళి నిర్దళన్మధుపరంపర నెత్తురు వోలెఁ గ్రమ్మఁగన్.

159


క.

మారుం డంతటఁ బోక స, దారుణగతి మించు మావితలిరాకుఁగఱా
చూరిఁ గొని నఱకి పచ్చని, వారువముం డిగ్గి కదియ వచ్చి కడంకన్.

160


క.

పేరెంబువాఱి హల్లక, కోరకకుంతంబుఁ గేలఁ గొని భీషణహుం
కారంబు మీఱ నదలిచి, క్రూరత నమ్మౌనిమది చుఱుక్కునఁ బొడువన్.

161


గీ.

అంబరాంచలభాగదృశ్యంబు లగుచుఁ
దనరుతత్కాంతపృధుపయోధరము లపుడు
లలితనవచంచలాలోకములఁ బెనంగి
పొదలి యాహంసుఘనతమస్ఫురణ మడఁప.

162


సీ.

అడరి జాలైనఘర్మాంబుపూరంబుచే వదలఁజాలనిధృతి వదలిపోయె
దట్టంబుగాఁ బర్వునిట్టూర్పుగాడ్పుచే నెడల నేరనిశీల మెగసిపోయెఁ
బెనఁగొని యందంద యెనయుకంపంబుచే జనలేనిమౌగ్ధ్యంబు జాఱిపోయె
వడిఁ బట్టు లేక వెల్వడుపులకాళిచే విడువ నోఁపనిలజ్జ [1]విడిచిపోయె

  1. చ-ట-వీటిపోయె