పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ఉరుభోగోన్నతి మారుతాశనులు సొంపూనన్ శిలాదు ల్రహిం
గరఁగ న్నిర్విటపాప్తి నిశ్చలతరు ల్గాఢానురాగాంకుర
స్ఫురణం బొందంగ హంసరాజిగతిచొప్పు ల్దప్పఁగా నొక్కసుం
దరి గీతంబులు పాడె నాత్మహృదయోత్సాహానుకూలంబుగన్.

143


చ.

అరుదుగఁ జంద్రరేఖ యతి నప్పుడె కన్గొనినట్టు లందియల్
మొరయఁగ మేను సోలఁ గుచము ల్పొదల న్నెఱివేణి జాఱఁగా
సరభసవృత్తి నేగి యొకసంపఁగిక్రొవ్విరిమొగ్గ సిగ్గునం
గరకమలంబు సాఁచి కయికానుక గాఁగ నొసంగి యత్తఱిన్.

144


గీ.

ప్రసవబాణుని నీయింటిబంటు గాఁగ, నిలువఁజేసెద ననుచు సందియము దీఱ
నానయిడి చాల నమ్మింపఁబూనినట్టు, లమ్మునీంద్రునిపాదంబు లంటి మ్రొక్కె.

145


ఉ.

మందసమీరలోలలతమాడ్కి నొకింత వడంకు నూనుచున్
ముందఱ కేగి యాజటిలముఖ్యుని డాయఁగఁ గొంకి డెందమున్
డిందువడంగఁ జేయుచు వడిం బురికొల్పఁగ బుజ్జగించుసూ
టిం దరళస్ఫురత్కుచతటీఘటితాంజలి యై నయంబునన్.

146


సీ.

తొడుకుబాబారౌతుజడదాల్పువాడనిపూ వేలతాంగులపుట్టినిల్లు
జేజేలకఱవు మాన్చినవదాన్యునిగన్నవనధి యేలేమలజననసీమ
మున్నీట నిల్లటంబు వసించు దొరయూరుకాండ మేకాంతలఁగన్నకడుపు
వెన్నుపొక్కిటితమ్మి నున్నవేలుపుమానసం బేవెలందులజన్మభూమి
నలువతలకోరగల మేటినెలవుమొదలు, [1]గాఁ గలపదంబు లేనీలకచలయునుకు
లట్టియచ్చరకులమునఁ బుట్టినట్టి, దాన ననుఁ జంద్రకళ యండ్రు మౌనివర్య.

147


సీ.

కమనీయతరగానగాంధర్వలాస్యతాండవకలారూఢిఁ బ్రౌఢ నగుదాన
సకలసౌఖ్యముల కాస్పదమైన దివి నేలు బలభేదిసవిధంబు కొలువుచెలువు
చిత్రరేఖాఘృతాచీధాన్యమాలినిరంభాదిసతులు నాప్రాణసఖులు
శ్రీరంగనాయకు సేవింప నిటకు నిచ్చలు రాకపోకలు సలుపుచుందు
నిన్ను సేవింపవచ్చితి నేఁడు దివ్య
మౌనివర తావకాలోకమహిమవలస
నలఘుసాత్త్వికభావంబు గలిగె నాకుఁ
దలఁ పెఱిఁగి నన్నుఁ గరుణింపవలయు ననుడు.

148
  1. చ-గాఁగ నచలంబు