పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘనరసాశయపద్మినుల్ కలితభృంగ,
ఘోషభాషల నతిథులకుశల మడుగ
నంగసంభవనిర్భరు లగుచు నిచటఁ, దపము సలిపెడు తాపసోత్తములఁ గంటె.

126


సీ.

అజిరతోరణములకై యుంచితిని జుమీ యతివ నీ వీచిగు ళ్లలమఁబోకు
మగ్రవేద్యర్చనకై యుంచితిని జుమీ యబల నీ వీమొగ్గ లంటఁబోకు
మజ్జనాభసపర్యకై యుంచితిని జుమీ కొమ్మ నీ వీవిరు ల్కోయఁబోకు
మతిథిసంతర్పణకై యుంచితిని జుమీ తరుణి నీ వీపండ్లు దడవఁబోకు
మనచు నొండొరుఁ బలుకుచు నలసగతులఁ
గౌను లసియాడఁ గుచములు గదలఁ గురులు
చెదరఁ బనఁటులు మూఁపునఁ జేర్చి లతల
కర్థి నీరార్చుమౌనికన్యకలఁ గంటె.

127


వ.

మఱియు నీవనంబు నీ వనం బురోవర్ధితశంబరం బై శంబరప్రవాహంబులీల వి
హరమాణహంసం బై హంసబింబంబులాగున వశీకృతప్రచారం బై గోప్ర
చారంబుంబోలె నవలంబితవృషం బై వృషపట్టనంబుకైవడిఁ బూర్ణసుమనో
జాతి యై సుమనోజాతిచందంబునఁ బవిత్రితగోత్రం బై గోత్రధరుకారుణ్యం
బుఠేవ దేవదత్తామృతం బై యమృతాకరంబుతీరున ననంతసముద్భూతో
త్కలికం బై యుత్కళికలు సుమధూళిపరంపరలఁ గురియ సుమధూళిపరం
పరలు కదళికల నెరయఁ గదళికలు విమలస్థలసారసవనంబులు మొరయ విమ
లస్థలసారసవనంబులు శిఖికలాపంబుల మురియ శిఖికలాపంబులు మరున్ని
కరంబుల నొరయ మరున్నికరంబులు పున్నాగవర్గంబులఁ బొరయఁ బున్నా
గవర్గంబులు కుసుమభారంబుల విరియ సిరి యెసంగెఁ గనుంగొను మనుంగుఁ
జెలీ! యన ననవిలుకాఁడు తత్తపోవనంబు సొత్తెంచి.

128

మదనసైన్యము భరద్వాజుని గదియుట

సీ.

సహకారసహకారసాంద్రలతావృతాభోగయాగగృహాళీ పొసఁగుచోటఁ
గరకాంతకరకాంతరరసార్ద్రభూమిభూమౌనిమానితతరు ల్మలయుచోట
ఘనసారఘనసారకలితానిలాకులాళిందకుందరసంబు చిందుచోట
వనజాతవనజాతవలితాపగానుగానేకకోకధ్వను లెరయుచోటఁ
గేళికాశాలికాయితోత్తాలసాల, పాలికాశాలికాసారపద్మపద్మ
ధూలికామాలికామదోత్తుంగభృంగ, బాలికాడోలికారతు ల్పరఁగుచోట.

129