పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లధిప మముఁ జూడు మనుచు మహామృగవ్య
విపినతల మెల్లఁ దాము యై వెలసి రపుడు.

35


సీ.

పక్కునఁ జొరఁబాఱి పాలచేరులు పట్టి బలిమిమైఁ జదికిలఁబడఁగఁ దిగుచు
దిగుచుచోఁ గ్రక్కునఁ దిరిగి కొమ్ములఁ జిమ్మఁ దొలఁగి యల్లంతని నిలిచి వదరు
వదరి పోవఁగనీక వచ్చి యడ్డము చేరి కెరలి [1]యల్లంతనె తెరువు గట్టుఁ
గట్టి యన్నియు మాలెగట్టిరొప్పకమున్నె కదుపులోఁ జొరఁబడి చెదరఁద్రోలుఁ
ద్రోలి గుబ్బున వెనుకొని తోఁకఁ గఱచుఁ, గఱచి వెనుద్రొక్కి పెడతలగంటి సేయుఁ
జేసి యిటు లేకలంబులఁజిక్కు వఱచు, శబరు లౌ రౌర యనఁ గొన్నిజాగిలములు.

36


గీ.

దట్టికొంగు మెడకుఁ జుట్టి మెల్లన పొద, చాఁటుబడిసె తెచ్చి శబరుఁడొకఁడు
బయలురొప్పుపందిపైఁ గాటు మరిగిన, వేఁటకుక్క నంటవిడిచి పొడిచె.

37


క.

వడి నొక్కఁడేకలము వెం, బడిఁ జనుచో వెనుకఁ గవిసి పైఁ బడినపులిం
బెడమరలి కెరలి తనమొల, పిడియమ్మునఁ గడుపు చించి పెళ పెళ నార్చెన్.

38


[2]సీ.

జాఠరశిఖిశిఖాజాతధూమంబులచాడ్పున నల్లనిచాఱ లెసఁగఁ
గ్రోధద్రుమాగ్రసంరూఢపల్లవముల చెలువున నిక్కినచెవులు దనర
సకలమృగానీకశాసనోద్ధత వేత్రవల్లికచందాన వాల మమర
నాస్యగహ్వరరసనాహీంద్రవిషలతాచ్ఛటలు నాఁ గఱకుమీసలు వడంక
నావులించుచుఁ గబ్బునకడరునీఁగ, మూఁకఁ గమియుచు సెలవులు నాకికొనుచు
భూరిభీకరభాంకృతు ల్పొదలఁ గొన్ని, పొదలనడుచక్కి బెబ్బులి గదిసె [3]నొకటి.

39


క.

ఆపులి నిజతురగదిదృ, క్షాపరత న్నిగుడ దానిఘనపరుషరుషా
చాపలతం దూపు భుజా, చాపలతం దొడిగి శౌరిసంభవుఁ [4]డడిచెన్.

40


క.

కూలమ్మున నొకఁడు సరి, త్కూలమ్మున ఖడ్గి నేసి కో యని యార్చెన్
వాలమ్మున నొకచమరీ, వాల మ్మఱఁజేసి యొకఁడు వడిఁ బొగడొందెన్.

41


గీ.

కడిమిఁ గదియుకుక్కఁ బడఁగొట్టి యొకకిటి, మోటు పెట్టి రొప్ప నోటినురువు
సెలవులందుఁ బొలిచెఁ దళుకుదంష్ట్రికలకు, సరవి నిడ్డ బిరుదుజల్లు లనఁగ.

42


గీ.

ఒకఁడు పొదలు తూఱి యుఱికెడుకుందేటిఁ, గూడనేయ బల్లకోల దనరె
గలిమినుండి కృశతఁగడ కేగె నిది యని,యలుకఁ దఱుము చంద్రకళ యనంగ.

43


క.

హరిసుతుఁ డొకహరిణముపై, హరి సడ్డము నూఁకి యేయ నాశుగ మధిక
త్వరఁ బఱవఁజేసె దానిం, జరమాంగకమై నిజాఖ్య [5]సఫలతఁ బొందన్.

44
  1. చ-యంతంతనె
  2. దీనితో గ్రింది 4 పద్యములు ట-లో లేవు.
  3. చ-నొకఁడు
  4. చ-నేసెన్
  5. చ-సఫలము గాఁగన్