పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాయలు శ్రీరంగపట్టనరాజ్యమును వేంకటపతిరాయలు చంద్రగిరిరాజ్యమును బాలించుచుండి రనియుఁ గాన్పించుచున్నది. మఱియును శ్రుతిరంజని యను గీతగోవిందవ్యాఖ్యలో—

"జయతి తిరుమలేంద్ర స్తేషు విఖ్యాతకీర్తిః
సమదరినృపవళిస్తోమనీరాజితాంఘ్రిః
సుగుణనుతచతుష్క న్యస్తరాజ్యాతిభారః
కృతబుధవరవిద్యాగోష్ఠిరత్యూర్జితశ్రీః”

అని యున్నది. ఈపద్యముల నాధారము చేసికొని శ్రీరంగరాయలు రా జైనతరువాతఁ గూడఁ దిరుమలరాయలు కొంతకాలము జీవించియున్నాఁ డనియు వసుచరిత్రము క్రీ. 1574-వ సంవత్సరము తరువాతనే పుట్టిన దనియుఁ గొంద ఱూహించుచున్నారు. కాని, యిది యుక్తము కాదు. శ్రుతిరంజనీపద్యభావము తిరుమలరాయలు రాజుగా నుండియే రాజకార్యములఁ గొన్నిటిని గొడుకులచేఁ జేయించి తాను విద్యాగోష్ఠియం దెక్కువకాలము వినియోగపఱుచుచుండె నని యే కాని రాజ్యమును వదలుకొన్నాఁడని కాదు. "మదరినృపమాళిస్తోమనీరాజితాంఘ్రిః" అనువిశేషణ మీయూహను బోషించుచున్నది. తిరుమలరాయలు రాజ్యము వదలుకొన్నమాటయే నిజ మైనయెడల నారాజ్య మొక్కకొడుకునకే గాని నలుగురకు సంక్రమించదు. వసుచరిత్రపద్యము లీయర్థమునే దృఢపఱుచుచున్నవి. తిరుమలరాయలకాలములో శ్రీరంగరాయలు యువరాజుగను రామరాయలు శ్రీరంగపట్టనరాజ్యాధికారిగను వేంకటపతిరాయలు చంద్రగిరిరాజ్యాధికారిగ నుండి రని యున్నది. వా రాయాకార్యములను దిరుమలరాయల యాజ్ఞానుసారముగనే నెఱవేర్చుచుండి రని నిర్ణయించవలసియున్నది. యువరాజు రా జగునా? కాఁబట్టి తిరుమలరాయలు క్రీ. 1574-వ సంవత్సరమునకు ముందే చనిపోయినాఁ డనియు వసుచరిత్ర మంతకుఁ బూర్వమే పుట్టిన దనియు సిద్ధాంతీకరింపవచ్చును.

వేంకటపతిరాయలయాస్థానమం దనేకులు పండితులుఁ గవులు నుండిరి. తిరుమల తాతాచార్యులు, కందాళ అప్పలాచార్యులు నను వైష్ణవాచార్యులు వేంకటపతిరాయల మతగురువులుగా నుండిరి. సుప్రసిద్దుఁ డగు నప్పయదీక్షితులు గూడ నీకాలపువాఁడే. ఈయన వేలూరు సామంతరాజైన చినబొమ్మనాయఁకుని యాస్థానవిద్వాంసుఁడుగా నుండి రాయలచేతఁ గూడ గౌరవింపఁబడుచుండెను.