పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీమాహురనగరోన్నత, భూమీధరశిఖరనిలయ భూరిసుగుణ ల
క్ష్మీమహనీయాభ్యుదయ సు, ధామధురకథాభిధేయ దత్తాత్రేయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


సీ.

చిలు కంపపొదికిఁ దార్చిననెమ్మిపురిజల్లిచే నెక్కిడిన చేగసెలసువిల్లు
గట్టిగా దట్టిగాఁ గట్టినపులితోలుఁ గుడివంక దోఁపినకుఱుచపిడెముఁ
[1]బేరెదఁ జేర్చినపికిలిపూవులచేరుఁ గుడిసంది గురిగింజకుట్టుదండ
జుంజుఱుసికమీఁదఁ జుట్టినతలముళ్లు దట్టిలోపల నఱపెట్టుచుట్ట
కోరమీసలు మిడిగ్రుడ్లు గునుకునడుపు, బెదరుఁజూపులుఁ గఱిమేనఁ గదురుకంపు
పలుదయోరచ్చులును గల్గి వచ్చె నెఱుకు, పాళెగాఁ డొక్కఁ డాచంద్రభానుకడకు.

3


గీ.

వచ్చి సాష్టాంగ మొనరించి తెచ్చినట్టి, కానికలు మ్రోల నిల్పి దౌగలుగ నిలిచి
సారె నవియెల్ల వేర్వేఱఁ బేరు గ్రుచ్చి, ఘనఘటాఘర్ఘరధ్వానగరిమఁ బలికె.

4


సీ.

ఈపచ్చిబదనిక లేపాటి సూపినఁ దఱుముసింగం బైన వెఱచి పోవు
నీపీలిగఱికోల లేపాటి కాఁడిన గజములైనను జూఁపకట్టు గూలు
నీపాఁపతలకెంపు లేపాటి గన్నను గబ్బిబెబ్బులి యైనఁ గళవళించు
నీపెద్దవిలుమ్రోత లేపాటి విన్నను రొప్పుకోలం బైనఁ దప్పనుఱుకు
దేవ యీతక్కువానిలో నేవిపేరు, గ్రుచ్చినను జాలుఁ జనుఁగలగుండు వడుచు
గండభేరుండవాహారి గవయ శరభ, ఖడ్గములు నాఁగఁ గలుగు మెకంబు లెల్ల.

5


శా.

సామీ దేవరపేరు సెప్పికొని యీసంద్రంపుఁ బెన్గోనలో
గీముల్ గైకొని చుట్టపక్కములతోఁ గీ డెన్నఁడు న్లేక మా
భూమిం గల్గినవేఁటతోడఁ గడుపు ల్బూరింతు మిం తేనియుం
బూమె ల్మామదిలో నెఱుంగక దినంబుల్ ద్రోతు మిచ్ఛాగతిన్.

6


క.

దేవరకు వేఁటవేడుక, గావలసిన నిపుడ రమ్ము కానలఁ దఱచై
యేవంకఁ జూచినను దగఁ, బోవఁగలే కాడనాడఁ బొరలుమెకంబుల్.

7
  1. ట-పిరిదండఁ జేర్చిన