పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని విన్నవించి యతఁ డో, జనార్దనా యిప్పు డేను సవసవగా నే
ర్చినపాటి యొక్కగీతము, వినిపించెద నంచుఁ [1]జేతివీణె చెలంగన్.

124


క.

సరిగమపదనిసమాఖ్య, స్వరసందర్భంబు మెఱయ సారెలమీఁదం
గరమిడి గమకము లేర్పడ, మొరయించుచుఁ గొన్నిగీతములు పలికింపన్.

125


సీ.

ఒక లేమ యతనికి నుద్ది లేదని యిచ్చుకరము నా మడు పొండుకడకుసాఁరె
గేయ మౌఁ గాదన్న గెలువఁగొంగిచ్చె నాఁబావడ యొకయింతి బయలొసంగె
నువిద యొక్కతె మెచ్చి యొసఁగూనె నాఁజామరం బెత్తి వంచనేరక వసించెఁ
బరులవిద్యలు బరాబరి సేయుతెఱఁగు, నాసుదతియొక్కతె మోడ్పు సురటి విసరె
నిట్లు కొలువున నున్నపూర్ణేందుముఖులు, సమహితాశ్చర్యపరవశస్వాంత లైరి
హరియుఁ గన్నుల చెవులుగా నాలకించె, నాతపోధనుమహతీరవామృతంబు.

126


శా.

ఔరా మీటు బళీరె కంపిత మహో యాందోళితస్ఫూర్తి యో
హోరే మూర్ఛన బాపురే శ్రుతులు మే లుల్లాసితప్రౌఢి మ
జ్ఝారే లీనము చాఁగురే స్ఫురితమున్ శాబాసు ధా లంచు న
త్యారూఢప్రమదోన్నతి న్మురహరుం డాలించి వర్ణించుచున్.

127


గీ.

హృద్యతరతద్విపంచికావాద్యవిద్య, [2]నభ్యసింప మనఃకుతూహలము పూని
తనదు చెంగట [3]నలరు వైదర్భికూర్మి, సుతుని సత్యా[4]తనూభవుఁ జూపి పలికె.

128


క.

ఓవాచంయమి కొన్నా, ళ్లీ విక్కడ నధివసించి యీ బాలకులం
దావకశిష్యులుగా దయఁ, బ్రోవు మన న్ముఖసరోజమున నగవొలుకన్.

129


శా.

అంగీకార మొనర్చి [5]మౌనివరహర్యక్షుండు వా రిర్వురన్
సంగీతాభ్యసనైకతత్పరులఁ జెంతం జేరఁగాఁ బిల్చి త
న్మాంగళ్యాచరణం బొనర్చి కవవీణ ల్గూర్చి కౌతూహలా
భంగప్రౌఢి నుపక్రమించె శుభదప్రఖ్యాతలగ్నంబునన్.

130


సీ.

సప్తస్వరములమూర్ఛనలు తప్పకయుండ గుఱుతుపట్టుటకు కొన్నినాళ్ళు
సూళాదితాళము లొగియ నలంకారగుంఫనం [6]బొనఁగూర్పఁ గొన్నినాళ్లు
ప్రాగ్గేయకారవిరచితగీతంబులు [7]గ్రుక్కపట్టుటకునై కొన్నినాళ్లు
గౌళనాటవరాళికాముఖ్యరాగము ల్కొదలేక పలికింపఁ గొన్నినాళ్లు

  1. చ-ట-వీణియ చెలఁగ
  2. చ-ట-అభ్యసింపఁ గుతూహల మాత్మఁ బూని
  3. చ-ట-నడరు
  4. చ-ట-తనూజుని
  5. ట-యామునికులాధ్యక్షుండు
  6. ట-బొనరింప
  7. చ-ట-గొంకులేక వహింపఁ గొన్నినాళ్లు