పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గళుకున్వజ్రపుఁగీలు చేసరపణిం గన్పట్ట నారామవీ
థులలోఁ దాళము పూని యాకొమరుఁ డాప్తు ల్వెంటరాఁ ద్రిమ్మరున్.

109


[1]చ.

ఉడిగపువారు చే సగతు లూనుచుఁ బజ్జలఁ జేరి పాద పా
పడెయలిరాగెనాంగదలెస్వామి యహో జతనయ్య యంచు వెం
బడిఁ బలుమాఱు నెచ్చరిక పల్కుచుఁ గుల్కుచు రా హుమాయిత
త్తడి దుమికిఁచుచుం జను నతండు వయాళి హయాళి గొల్వఁగన్.

110


క.

తనకూర్మిసఖుఁడు సాత్యకి, తనయుం డగువిజయలోలుఁ దగఁ గూడి జగ
ద్వినుతుఁ డతఁ డట్లు మాధవు, నెనసినమకరాంకు[2]పగిది నింపొందుతఱిన్.

111


సీ.

సర్వతోముఖమార్గసంచారి యగువాఁడు తనప్రజల్ దనివొందఁదలఁచువాఁడు
భూదారవిఖ్యాతిభూషితుం డగువాఁడు హితునియక్కఱకునై యెసఁగువాఁడు
బలిగర్వసర్వస్వభంజనుం డగువాఁడు పూన్కి దప్పని రూఢిఁ బొల్చువాఁడు
ధర్మాభి[3]వర్ధనతత్పరుం డగువాఁడు పరువీటిసిరు లేటఁ బఱపువాఁడు
వినుతసర్వజ్ఞతాస్ఫూర్తి వెలయువాఁడు, హరి దువాళింప నేర్పరి యైనవాఁడు
దనుజులోకాభియాతిసంతతవిభూతి, నవని యేలుచు నొకనాఁ డహర్ముఖమున.

112


మ.

పలుమాఱు న్సముఖా యటంచుఁ బలుదబ్బ ల్పూని వేర్వేఱ ది
క్తలరాజన్యుల నెల్లఁ గంచుకులు వక్కాణింప సాత్రాజితీ
లలనాభర్త జగాహజారమున జాళ్వాసింహ[4]పీఠంబుపైఁ
గొలువుండెం గురు[5]పాండవప్రభులు కింకుర్వాణులై యుండఁగన్.

113

నారదాగమనము

సీ.

స్వర్గాపవర్గము ల్సవదరించినబిరుదము నాఁగ మహతి యంసమునఁ దనర
నమితతపోనిధానముఁ గాచుభుజగనాయకుఁడు నా యోగపట్టిక యెసంగఁ
దనుకాంతి వెడఁదహస్తమున వ్రాలిననిశానేత నా స్ఫటికకుండిక చెలంగఁ
గంజవిభ్రాంతిఁ జెంగట డాయుతేంట్లు నా వలకేల నలినాక్షవలయ మమర
నారదుఁడు గానఁ బెనఁగొన్న నవ్యచంచ, లాలతలకైవడి జటాకలాప మెసఁగ
నపుడు దివినుండి యుట్టిపడ్డట్లు వచ్చె, దివిజసంయమి హరిసభాభవనమునకు.

114


క.

ఈరీతి నరుగుదెంచిన, నారదునకు నెదురుగాఁగ నడతెంచి నమ
స్కార మొనరించి యుచితా, చారంబుల నతిథిపూజ సలుపుచు నంతన్.

115
  1. ట-లో నీపద్యము లేదు.
  2. చ-కరణి
  3. చ-వర్తన
  4. చ-పీఠంబునన్
  5. చ-పాండవాధిపులు, ట-పాండవాదికులు