శ్రీకృష్ణుఁడు సత్యభామసౌధమున కేగుట
క. |
ఒకనాఁడు నందకులనం, దకుఁ డాసత్యావధూటిధామంబున నా
హ్నికకృత్యంబులు దీరిచి, యకలంకామోదమానసాంభోరుహుఁ డై.
| 88
|
సీ. |
ఒక కొంత యొరఁగినసికమీఁది ముడివువ్వుటెత్తుల దొరయఁ దాయెతులఁ జుట్టి
పన్నీటిచినుకులఁ బద నైననికరంపుఁగస్తూరివరతిలకంబుఁ దీర్చి
గంబూర మించి కదంబంబు చేసినపలుచనికుంకుమకలప మలఁది
చెక్కుటద్దములపైఁ జికిలివెన్నెలసోన లొలికెడు కట్టాణియొంట్లు దాల్చి
మెఱుఁగుఁజంద్రిక[1]గోణము చెఱఁగుడాలు
వలిపె[2]వలెవాటుదుప్పటి వెలికిఁ గ్రమ్మ
మినుకురవకెంపుఁబావలు మెట్టి యొక్క
యతివ కైదండ యొసఁగ నొయ్యార మెసఁగ.
| 89
|
చ. |
పవడపునిల్వుఁగంబములపై నెలకొన్నపసిండిబోదెలం
జివురుచు కెంపుడా ల్మదనచేతులఁ దార్చినవేల్పురాచఱా
సవరనికేలుఁదామరలచాయలు సోరణగండ్ల ధూపపుం
బొవలుగమించు కేళిగృహముం బ్రమదంబున డాసి యచ్చటన్.
| 90
|
చ. |
అలఁతిగ నంటినం బొలుచునారజపున్ జగజంతరీరొదల్
గులుకుమెఱుంగుఁగెంపుతఱిగోళ్ల నమర్చిన నాగవాసపుం
గొలుకుల జళువాగొలుసుగోళ్లఁ దగుల్కొని వ్రేలుపచ్చఱా
చిలుకలతూఁగుమంచమున శ్రీరమణుండు వసించు నత్తఱిన్.
| 91
|
చ. |
చికిలికిరీటిపచ్చరవిచెక్కడపుంబని కీలుఁజిల్కతో
రక మగుపైడియాకుపదరంబున నుంచినపండుటాకు లి
చ్చకపుటొయారము ల్వెలయ సత్య కరంబునఁ బూని వేడ్క నొ
క్కొకమడు పొయ్య నిచ్చుచు మృదూక్తుల ని ట్లనియె న్మురారికిన్.
| 92
|
సీ. |
పినపినయపరంజిబిరుదులయడపంబు గట్టఁ బాండ్యక్షమాకాంతతనయ
కళ గలపచ్చకంకణములకాళాంజి దాల్పఁ గోసలమహీధవకుమారి
చకచక మించువజ్రంపుటీనెలకుంచె నీవఁ గర్ణాటభూవిభుతనూజ
తళతళ వెలుఁగు రేవెలుఁగుఱానునుగిండి పూన మాళవధరాజనిపుత్రి
|
|
- ↑ ట-గోణాము
- ↑ చ-దుప్పటివలెవాటు