పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రతిమానోన్నతిఁ [1]దోలియాడుఁ దిలకింప న్శుద్ధవర్ణాధిదే
వత గాదే నరసప్రధానమణిదివ్యత్కీర్తి యశ్రాంతమున్.

29


చ.

నరసామాన్యచరిత్రుఁడే ధర బుధానందప్రదానూనదా
నరసామాన్యయశోవిశోభితదిగంతశ్రేణిగంధర్వకి
న్నరసామాత్యభిరామశుద్ధతర[2]గాంధర్వైకసంస్తుత్యుఁ డౌ
నరసామాత్యవరం డనంతపదచింతాపావనుం డెంతయున్.

30


గీ.

వెలయు నాతనిదేవేరి విజితభర్తృ
దేవతాజననికురుంబ తిప్పమాంబ
బహుమహాభోగముల నుంచుభర్తకుఁ దల
వంపు లొనరించినధరిత్రిపెంపుఁ దెగడి.

31


సీ.

సకలసన్నుతచర్య సద్గురుపరిచర్య పావనయదువర్యపదసపర్య
యన్నదానఖ్యాతి యనఘసాధ్వీనీతి నియతార్యజనతాతిశయవినీతి
బంధురక్షాశక్తి పరమధర్మాసక్తి నిత్యసూనృతయుక్తి నిర్మలోక్తి
యాశ్రితాశాపూర్తి యలఘుశీలస్ఫూర్తి బహుసతీముఖవర్తిభవ్యకీర్తి
యార్తసంరక్షణంబును నతులభాగ్య, లక్షణంబును గారుణ్యవీక్షణంబు
సహజసిద్ధంబు లీపుణ్యచరిత కని ను, తింపఁ బొగడొందు నరసయతిప్పమాంబ.

32


చ.

గురుపరిభూతి లేనిసతి గోత్ర[3]ధరస్థితి లేనియుర్వి సో
దరపరిపాలనావిముఖధామవిహారము లేనికల్మి బి
త్తరి యని బాంధవాశ్రితవితానము సన్నుతి సేయఁ బొల్చు నా
నరసయతిప్పమాంబ భువనస్తవనీయగుణావలంబ యై.

33


శా.

అత్రిప్రాభవుఁ డానృసింహుఁ డనసూయాత్యంతసంస్తుత్యచా
రిత్రశ్రీనిధి తిప్పమాంబవలనం బ్రీతిన్ బుధానీకని
త్యత్రాణైకధురీణు నప్పవిభు నేత్రానందపూర్ణేందు ద
త్తాత్రేయాహ్వయు మల్లికార్జునుని నార్యాసక్తుఁ గాంచె న్మహిన్.

34


శా.

తారారాజి గణించుఁ జుల్కఁగఁ గళాధామాంశుమాద్యత్సుధా
పారావారతరంగరేఖలఁ దృణప్రాయంబుగా నెన్నుఁ దా
నౌరా యప్పయమంత్రిశేఖరుని సంఖ్యావత్త్వముద్రామహా
ధౌరంధర్యనిరూఢనిర్మలయశోధారాపరీవాహముల్.

35
  1. చ-దోఁపనాడు
  2. క-గాంధర్వేశ
  3. చ-భర