పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మఱియు బహువిధరత్నసంపద లొసంగి
యపుడు నిజకన్యఁ బ్రియునింటి కనుపఁదలచి
రాజమణి బుజ్జవముసఁ జేరంగఁ బిలిచి
యాదరోదారమృదులవాక్యములఁ బలికె.

187


క.

శ్రీభర్త మామ యలస, త్యాభినుతసమాఖ్య యత్తయఁట తత్సేవా
వైభవ మెప్పుడుఁ గలదఁట, నీభాగ్యం బేమి సెప్ప నీరజనయనా.

188


ఉ.

చిన్నటనాఁట నీకరకుశేశయముం గని పెద్ద లెల్ల లో
కోన్నతదివ్యజాతిమహిమోజ్జ్వల యౌ నని పల్కుపల్కు నేఁ
డెన్నిక కెక్కె సర్వభువనేశ్వరుఁడైన యుపేంద్రు[1]కోడలై
కన్నియ పారిజాతకలికావహనార్హత నీవు గాంచుటన్.

189


గీ.

ఇనవిముఖవృత్తి కలనైన నెనయకమ్మ, యెందు దోషాభిముఖ్యంబుఁ జెందకమ్మ
కన్నవారికి నతిచిత్రగరిమ గలుగఁ, గుముదినిహితాళులకు విందుఁ గూర్పవమ్మ.

190


క.

అని పలికి నృపతి కన్నియ, ననుపమతరవైభవమున ననుపఁ బ్రియసుహృ
ద్వినుతహృదయారవిందుం, డనువిందుఁడు నట్ల యనిచె నాత్మజ నంతన్.

191


మ.

ప్రమదాయుక్తకుమారరత్నములతోఁ బ్రత్యగ్రగంధేభవా
హమహాస్యందనవస్తుసంపదలతో నానందసందీప్తబం
ధుమహీభృన్నివహంబుతోఁ గతిపయాదూరప్రయాణంబులం
గమలానాథుఁడు వచ్చె ద్వారవతికిం గౌతూహలాన్వీతుఁడై.

192


క.

ఆవేళఁ జంద్రభానుని, దేవేరిం జూచువేడ్క దీపింపఁ బురీ
కేవలమధ్యలు మణీనం, భావితసౌధంబు లెక్కి పలికిరి తమలోన్.

193


చ.

పొలఁతుకఁ జూడరమ్మ గడివోవనిచక్కఁదనంబు తెమ్మ చెం
గలువలకోరికాని కయికానికి ముద్దులగుమ్మ నిండుచు
క్కలదొరనిగ్గుతోఁ గరువుగట్టినపుత్తడిబొమ్మ వాసనల్
గలవిరికొమ్మ యిట్టినవలా నవలా యొకబాల పోలునే.

194


చ.

తలవలచుట్టు వచ్చుఁ గనుఁదమ్ములు తమ్ములు గండుమీలకుం
దళతళ వొల్చు నంగములతావులు తావులు కమ్మపూలకుం
గళతులకించు పెందుఱుముకప్పులు కప్పులు మబ్బురేలకున్
మెలఁతుకగుబ్బచన్నుఁగవమించులు మించులు బొమ్మరాలకున్.

195
  1. క-కోళ్లవై