పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శ్రీకాంతుం డిటు లేగుదెంచె నని సంప్రీతిన్ హితు ల్దెల్ప ను
ల్లోకానందముతోడ నావిజయలోలుం గూడి సత్యాసుతుం
డాకంజాక్షు నెదుర్కొన [1]న్వెడలి డాయన్వచ్చెఁ దో శాబరా
నీకంబు ల్నలువంకలన్ బలసి యున్నిద్రస్థితిం గొల్వఁగన్.

131


ఉ.

వచ్చి వినీతితో దనుజవైరికిఁ జాఁగిలి మ్రొక్కి సీరికిం
బచ్చనివింటివానికి నమస్కరణం బొసరించి భక్తితో
నచ్చట నున్న పెద్దలపదాంబురుహంబుల వ్రాల నందఱున్
గ్రుచ్చియుఁ గౌఁగిలించికొని కూరిమి దీవన లిచ్చి రయ్యెడన్.

132


మ.

నతరక్షానిధిశౌరి పక్కణముచెంత న్వేలమున్ డించి యు
న్నతదివ్యాంబరమండపాంతరమున న్సద్బాంధవశ్రేణితో
నతులస్ఫూర్తి వసింపఁ దత్సకలనృత్తాంతంబు చారు ల్రయో
ద్ధతులై తెల్పిన రుక్మబాహుఁ డనువిందాన్వీతుఁడై చెచ్చెరన్.

133


క.

ప్రియబాంధవవర్గముతోఁ, బయనం బై వచ్చి దనుజభంజను బలదే
నయుతుం బొడఁగని మ్రొక్కుచు, నయమంజులఫణితి నాజనార్ధనుతోడన్.

134


ఉ.

ఏమఖిలంబునుం దెలిసి యిచ్చటికిం జనుదెంచినార మిం
కేమియు నానతీవలవ దిప్పుడు మామన వాలకించి దే
వా మముఁ బ్రోవు పుత్రులవివాహ మొనర్పఁగ నేగుదెమ్ము గా
రామడర న్మదీయనగరంబున కేమిట లాతివారమే.

135


[2]క.

అని [3]నయము నెనరు దొరలం, దనకును విన్నప మొనర్చు ధరణీశుల మ
న్ననఁ జూచి యపుడు సాత్యకిఁ, [4]గనుఁగొని యాతండు నట్ల కాఁ దెలుపుటయున్.

136


గీ.

సకలసేనలు గొలువ నానాశార్ఙ్గపాణి, రాజసంబునఁ గుండినరాజధాని
డాయవచ్చిన మునుమున్న పోయి రుక్మ, బాహుఁడు బిడారములు నులుపా లమర్చి.

137


[5]సీ.

అపరంజివాకిళ్ల ననఁటులో యిడుపుల నెసఁగు పచ్చలడాలొ యెఱుఁగరాదు
బంగారుటిండ్ల దీపంబులో గోడల వెలుఁగు కెంపులడాలొ తెలియరాదు
జాళువాలో వలజల్లులో కొణిగెల నలరు వజ్రపుణాలొ యరయరాదు
పసిఁడియోవరుల ధూపంబులో సోరణగండ్లనీలపుడాలొ కానరాదు
మేలిమిహజారములు వన్నె మేలుకట్లొ, చిత్రమణికాంతులో విభజింపరాదు
అనఁగఁ జనునొక్కనగరున [6]నపుడు లీల, వనజనాభుని విడియించె మనుజభర్త.

138
  1. చ- దలఁచి
  2. ట-లో నీపద్యమునకుమాఱుగ "అనిన" అను వచనము గలదు.
  3. చ-ప్రియము
  4. చ-గనుఁగొన నాతండు నట్ల కానిమ్మనియెన్.
  5. ట-లో లేదు.
  6. చ-నధిపు లీల