ఇందు గ్రంథాదిని నారదవృత్తాంతము వర్ణింపబడినది. ఇదియే ప్రబంధ మెల్లఁ గల్పించుట కనువుపడినది. కలహాశనుఁడు రుక్మిణీనత్యాకుమారులకుఁ గయ్యము పెంప నూహించి చంద్రభాను ననాదరించెను. దానిచే నాతఁడు నారదునిపైఁ గినిసి తుంబురునివలన విద్య నేర్చి రా నుద్యుక్తుఁడై యట కేగి గానవిద్యతోపాటు కుముదినింగూడ సంగ్రహించుకొని వచ్చెను. తుదకుఁ దా నభ్యసించివచ్చిన గానవిద్య హరికిని బ్రద్యుమ్మునకును వినిపించి మెప్పునందెను. గానవిద్యయే కుముదినీప్రాప్తహేతు వగుటచే దానినే బీజస్థానమం దనువు పఱిచెను. విజయలోలునిపాత్ర మంత సార్థకముగ లేదు; మాయాకుముదినీరూపముం దాల్చి వాస్తవకుముదినిం జంద్రభానునితోఁ బంపుట కుపకరించినది. అసురయుద్ధమున రథచోదనమున కనువుపడినది. కాని శేషశైలవిశేషములఁ దెల్పి తన్నుఁ దా సార్థకపఱిచికొన్నది. వనములో నసురుఁడు యుద్ధమును గుముదినీలాభమునకు సాధన మగుశాంబరీవిద్య నేర్చుటకై కల్పింపఁబడినది. యుద్ధము లేనిచో మహాకావ్యలక్షణానురోధ మని కల్పించిన నుండవచ్చును. విజయలోలునికొఱఁత తీర్చుటకుమాత్రమే యనువిందునికూఁతురు కల్పింపఁబడినది. ఇంకను దరళికాదిపాత్రములు యథోచితకార్యసాధనమునకై యౌచితి నాలోచించి కల్పింపఁబడినవి.
అందందుఁ గొన్నినెరసు లగపడుచున్నయవి. రసలోలుపుల కవి పాటింపఁదగనివి. ఈయుత్తమగ్రంథ మెల్లర కవశ్యాదరణీయ మని నొడువుటయే శివము.
కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రి