పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆపృథ్వీరమణుండు పు, రోపాంతంబునకు వచ్చి యొకచక్కటిల
క్ష్మీపద్మముఖీసద్మము, లోపల నున్నట్టివిజయలోలుని గనియెన్.

24


చ.

కనుఁగొని బాష్పపూరకలిక ల్కనుఁదమ్ముల నిండ డాయఁగాఁ
జనుటయు నాతఁడుం గదిసి చాఁగిలి మ్రొక్కిన గ్రుచ్చియెత్తి నె
మ్మనమున హర్షచిత్రములు [1]మల్లడిగొట్టుచునుండ నొక్కచో
ననితరవాస మైనవిమలావనియందు [2]వసించె నత్తఱిన్.

25


శా.

శైనేయాత్మజుఁ డామురారిసుతు సాశంకంబుగాఁ జూచి యో
యీ నిట్టూరుపు లేల పె ల్లడరె మే నేలా కృశం బయ్యెఁ గన్
గోనల్ కెంజిగిఁ బూనె నేమిటికి నాకుం జూడ నీతీరు విం
తై నేఁ డిచ్చటఁ దోఁచె నీదువిధ మాద్యంతం బెఱింగింపుమా.

26


సీ.

అనఁ జంద్రభానుఁ డి ట్లనియె నాఁడు మయూరములఁ బట్టుటకు మనము చని యడవిఁ
గవవాసి యొండొరుఁ గానంగలేక పోయిన నంతఁ జింత నే నిచటఁ జేరి
వీణారహస్యంబు వీరసేనుని గూడి తుంబురుచే విరితోఁటలోన
నభ్యసించుచునుండ నచటికిఁ గుముదిని యేతేరఁ గంటి నాయిందుముఖయు
నను వరించెద ననుచునుండఁగఁ దదీయ, జనకుఁ డాచైద్యసూతికి సంభ్రమింప
వారు నేతెంచి యావనవాటి విడియ, నే నచటు వాసి వచ్చితి నిట వయస్య.

27


గీ.

అనుచు నాద్యంత మేర్పడఁ దనతెఱంగు, దెలుప నాశ్చర్యవారిధిఁ దెప్పఁ దేలి
యామురాంతకసుతునితో నాత్మచర్య, విజయలోలుండు పలుకు సవిస్తరముగ.

28


మ.

అటు లాబర్హిణము ల్చనం దదనుయాత్రారంభము ల్మాని య
చ్చట నిన్నుం గనలేక ఖేదదళితస్వాంతంబుతోఁ గుంది యు
ద్భటహర్యక్షమృగాదనంబు లగుకాంతారంబుల న్దైవసం
ఘటనం బాంథులఁ గూడి యొయ్యనఁ జనంగాఁ గొంతకాలంబునన్.

29

వర్షకాలవర్ణనము

శా.

హంసోచ్చాటనమంత్ర, మంగభవసాహాయంబు కాదంబినీ
సంసద్వైశసనంబు భాస్కరతిరస్కారంబు ఘర్మచ్చటా
సంసారాపగమంబు పంకజతమిస్రావేళ విశ్వంభరా
పాంసుధ్వంసన మంబుదాగమము దీపం బయ్యె నుర్వీస్థలిన్.

30
  1. చ-మల్లడిఁ బెట్టుచు
  2. చ-వసింప