పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవరాయ లట్లొనర్చినట్లు కానరాదు. రెం డుత్తమప్రబంధములం గొని తారతమ్యవిచారము చేయుట కష్టము. ప్రస్తుతచంద్రభానుచరిత్రమునకు వత్తము.

కథావిమర్శనము

చంద్రభానుచరిత్రమునఁ గథానిర్మాణము విచిత్రముగ నున్నది. ఈకవి క్రొత్తమార్గముం త్రొక్కినాఁడు. ప్రప్రథమమున రుక్మిణీవైభవాసూయచే సత్యభామకుఁ జంద్రభానూదయమును వర్ణించినాఁడు. పిదప నారదాగమనమున సంగీతాభ్యాసమను కథాబీజమును నాటెను. కలహాశనముని కుముదినీలాభమునకు మార్గదర్శకుఁ డయ్యెను. అడవిలో వేటాడుచున్న చంద్రభానునకుఁ దుంబురుని చెలికాఁ డొకసిద్ధుఁడు కుముదినీజన్మప్రకారంబుకు నామెకుఁ దుంబురుఁడు గానవిద్య నేర్పుటయుఁ దెలిపి కుముదినియందుఁ జంద్రభానునిమనం బొకింత లగ్నమగునటులు వర్ణించి యంతర్హితుండయ్యె. చంద్రభాను చెలికాఁ డగువిజయలోలునితోఁ గూడ వనమార్గమునం బోవుచు నొకచో బడలి నిద్రించుచుండ నొకజింకజంట వారిమెయి నాక నిద్రాభంగవ్యాకులమనస్కులై వారు హరిణపోతముల బెదరించిరి. ఈపనికై కోపించి దుర్వాసముని వీరిరువురకు వియోగము గలుగ శపించెను. పిదపఁ గాఱడవి నొకయుద్ధసాధనసన్నద్ధమగు రథ మీయదుకుమారులకు గోచర మగుడు నీరథికమగు నా తేరు వారధిగమించిరి. ఇంతలో నెక్కడనుండియో యకాండజలదాగమంబుంబోలి యొక్కరక్కసుం డరుదేరఁ జంద్రభానుఁడు ఘోరముగఁ బోరి వాని నుక్కడించెను. ఈయుద్ధవర్ణనము చదువుట కెంతయు మనోహరముగా నున్నయది. కూలిన యాదానవుండు శాపవిముక్తుఁడై కుముదినీలాభప్రధానసాధనం బగు మాయ నాయిరుపురుబాలకుల కిచ్చి యథేచ్ఛం జనియె. పిదస శాపవశంబున వియుక్తుండైన విజయలోలుఁడు తిరుపతికిని జంద్రభానుఁడు కుండినమునకు నేగిరి. చంద్రభానుని చరిత్ర మిఁకఁ బై నంతవిశేషములు కలది గాదు. విజయలోలునికథ ముఖ్యమైనది. విజయలోలునిపాత్రము శేషశైలవర్ణనమునకును గడపట గుముదినీ వేషముం దాల్చి ఫలమును సులభము సేయుటకునే కల్పింపఁబడినది. తిరుమలయం దాతనికిఁ గూడ ఫలప్రాప్త్యాశ యుదయించినది. కాని తుద కాతనిఫలప్రాప్తి ప్రధానము కానందునఁ గవి దాని నంతగా వర్ణింపక చంద్రభానునివలె విజయలోలుఁ డనువిందుని కూఁతు వివాహమయ్యె నని తేల్చివేసినాఁడు. ఇది కొంతవిరసముగ నగపడుచున్నది కాని యిట్లు తేల్చివేయుట యుచితమే. రామాయణమున రామపట్టాభిషేకము నట్లు విభీషణుని లేక సుగ్రీవుని పట్టాభిషేకములు వర్ణింపఁబడియెనా.