తరళిక చంద్రభానునకుఁ గంకణము నిచ్చుట
గీ. |
దేవ [1]చిత్తేశు సాత్రాజితితనయ........కాంతికుముదిని నిజకరకంకణంబు
ననిపె దేవర కిదె దీని నవధరింపు, మనుచుఁ బ్రాంజలి యైన నయ్యవనిభర్త.
| 120
|
క. |
వితతాశ్చర్యతరంగిత, మతియై యాలేమచేతిమణిమయవలయం
బతిమోదంబునఁ గైకొని, స్మితమంజులవాక్యసరణిచే ని ట్లనియెన్.
| 121
|
శా. |
రాగాంకూరలతాలవాలమవొ దౌర్భాగ్యాక్షరాక్షేపణో
ద్యోగాధిష్ఠితకుండలాకృతివొ [2]హృద్యుక్తాంగనాధైర్యసం
ధాగాఢాంగజదత్తవాగురవొ లేదా మత్తమో[3]రాహువుం
బ్రాగల్భ్యంబునఁ [4]ద్రుంచుచక్రమువొ భామాకంకణగ్రామణీ.
| 122
|
క. |
మణిబంధబంధురస్థితి, మణిబంధనవాధివాసమహిమ మెఱయు నిం
బ్రణుతించెద ననుఁ గన్యా, మణిబంధుం జేయవే సమంచితకరుణన్.
| 123
|
క. |
చెలువ మతితెఱఁగు నాతోఁ, బలికి కలఁక నడఁతు ననుచుఁ బఱతెంచితివౌ
వలయ ప్రకోష్ఠవాసికి, [5]నలవడు నీమదికిఁ దెలియు నంతర్వార్తల్.
| 124
|
చ. |
అగణితమన్మథాశుగమహాజ్వలితానలమామకీనహృ
ద్ద్విగుణితతాప మెంచదొ మది న్మహిభృద్వరజాత యాసమ
గ్రగుణకలాప సింధుమణి గానియెడన్ ఘనసారయుక్తిఁ జె
న్నగు విషులోర్మికం బనుప కంపునె ని న్నొకకంకణాకృతిన్.
| 125
|
చ. |
తొలువలఱాచకయ్యమునఁ దొయ్యలి నీవికి నెగ్గు వేఁ దమిం
దలఁచిన నడ్డగించుకరతామరసంబునఁ గూడునిన్ను నే
నలఁకువబెట్టఁ గంకణమ నమ్ము భవద్రుచిం కాంతయంగముం
దెలియఁగఁ జేయుమేలు మది నిల్పెదఁ గీ లెడలింప నొక్కెడన్.
| 126
|
మ. |
చెలి సంతోషముఁ గాంచునే సఖులకు న్సేమంబు సంధిల్లునే
లలనాపోషితశారికాశుకమరాళంబు ల్సుఖం బుండునే
సిలుగు ల్సూపునె పంచసాయకుఁడు రాజీవాక్షిపై రత్నభా
నిలయం భావలయంబ తెల్పు మని కన్నీరోడిక ల్గట్టఁగన్.
| 127
|
గీ. |
వివశుఁ డైయున్న యమ్మహీవిభుని జేరి, శిశిరవస్తులచేఁ గొంత సేదఁ దేర్చి
తలిరుకెంజాయసురటిచే నలవరించి, యొయ్య విసరుచుఁ దరళికాయువతి పలికె.
| 128
|
- ↑ చ-ట-చిత్తేశ
- ↑ చ-హృద్యోషాదృఢీభావముద్రాగాఢోద్యదనంగపాశమవొ, ట-హృద్వేషాదృఢీభాగముద్రాగాఢోద్యమనంగపాశమవొ
- ↑ చ-ట-వైఖరిన్
- ↑ చ-బాపుచక్రమవొ
- ↑ చ-ట-నలవడునే నీకుఁ దెలియ నంతర్వార్తల్