పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

8

శైలినిబట్టియు తెనాలి రామకృష్ణకవికి తరువాతివాడగు సూరనను పేర్కొనుటంబట్టియు నంత విశ్వసనీయముగ తోపదు" అని జ్ఞాపిక వ్రాసిపెట్టిరి. కాని ఈ పద్యమునందలి 'దానితల్లిగ' అన్నప్రయోగము రామకృష్ణునిదే కావలయు ననిపించుచున్నది. ఈ అర్థముననే ఘటికాచలమాహాత్మ్యమున "నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు మోము" (2-184) అని ప్రయోగించియున్నాడు. పాండురంగమాహాత్మ్యమునను "శైవాలవల్లికిం దల్లియై చెలువారు నూగారును" (3-179) అని ప్రయోగించినాడు. పుస్తకము లభింపలేదుగనుక చిక్కులున్న వనుకొనుచున్నాము. అది బయటపడినప్పుడు చిక్కు లెట్లో సవరింపబడును. మిగిలినకృతులతోపాటు ఈ పాండురంగవిజయప్రబంధరచనాకాలమును నిర్ణయింపబడును. అందుకు కాలము కలసిరావలయును.

మరికొన్నికృతులు రామకృష్ణుడు రచించినట్లుగా వినుకలియేగాని కనుకలి లేదు, అవి యివ్వి : (1) లింగపురాణము, (2) ఆదిపురాణము, (3) కందర్పకేతువిలాసము (4) హరలీలావిలాసము. ఈ చివరి రెండుగ్రంథములలోని వని కొన్నిపద్యములను రామప్రెగడ జగ్గన తాను సమకూర్చిన యుదాహరణగ్రంథములో ఉటంకించినాడు.[1]

ఉద్భటారాధ్యచరిత్రము, పాండురంగమాహాత్మ్యము, ఘటికాచలమాహాత్మ్యము మాత్రమే క్రమముగా రామకృష్ణుని ప్రస్తుత మున్న కృతులు.

5. రామకృష్ణుడు హాస్యగాడు కాడు :

తాను రచించినగ్రంథాలనుబట్టి అయినదానికంటె, తనకు సంబంధించిన సంబంధింపజేయబడిన, హాస్యప్రసంగకథావిశేషములచేత రామకృష్ణు డెక్కువగా నీ దేశమున ప్రసిద్ధుడు. హాస్యచతురుడుగా నయిదువందలసంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ ప్రజానీకమునకు సన్నిహితుడై ప్రవర్తించుచున్న రామకృష్ణుడు తానురచించిన గ్రంధములలో నెక్కడకూడ ఆ వాసనకలవాడుగానే కనిపించడు. నిత్యజీవితమున అలవోకతనమున కలవాటుపడిన ఈయన, కావ్యజీవితములో జాగృతుడు. మరియు గంభీరుడు. ఇందు కపవాదముగా, కవిస్వభావము కావ్యమున ప్రతిబింబించు ననుసిద్ధాంతమున కనుకూలముగా

కొందరు వాని కృతులనుండి ఒకటి రెండుపద్యములను, సన్నివేశములనుండి ఎత్తి చూపుదురు. అవి హాస్యా

  1. ఆంధ్రకవితరంగిణి సంపుటము 8. పుటలు. 27, 28.