పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఘటికాచలమాహాత్మ్యము


రాదిమాశ్రమము నారాయణగిరి నాకు
నల రెండవది ఘటికాచలంబు
వృషభాద్రి మూఁడవ దీమూఁడునెలవుల
నశ్రాంతమును నేను విశ్రమింతు
ననిన దద్దేవదేవు పాదాంబుజముల
కమ్మునీంద్రులు సాష్టాంగ మాచరించి
విన్నపము గల దొక్కటి వేదవేద్య
కృప దలిర్పంగ నది చిత్తగింపవలయు.

24


సీ.

జలజాక్ష! మూఁడుయోజనములదాక ని
గ్గిరిమీఁద ఝరులు దీర్ఘికలు నదము
లేరులు మడువులు భూరి మోక్షదములు
గావుత నేడాదిగాఁగ నిందు
వసియించు జనుల కాపద లెవ్వియును లేక
దయ శాంతి దాంతియు ధర్మబుద్ధి
కలుఁగంగవలయు మృగంబు లన్యోన్యంబు
మైత్రిచే నెప్పుడు మనఁగవలయు
శబర యవన పుళిం దాదిజనములెల్ల
జ్ఞాన వైరాగ్య ధర్మముల్ బూనవలయు
నెలనెలను మూఁడువానలు నిండఁగురియ
ధరణి సస్యసమృద్ధయై తనరవలయు.

25


సీ.

ఆగమ యాగ యో గాన్నదానైక ప
రాయణులగుచు ధరామరులును
కరులతో హరులతో వర వీరభటులతో
జగతిఁ బాలించుచుఁ క్షత్రియులును
ధన ధాన్య పశు సుహృద్బంధువర్గంబుతో
కోటికి [1]పడగెత్తి కోమటులును
ధరణిసురోత్తమచరణసేవారతి
ప్రవరులై [2]మనుచు శూద్రప్రవరులు

  1. పడగెత్తు. తా.
  2. మనెడు. తా. మించి. పూ. ము.