పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/189

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఘటికాచలమాహాత్మ్యము


మోవి ఠీవి నలంతినవ్వు నివ్వటిల్ల భక్తజనవిషయకారుణ్యంబున
నేత్రాంచలంబుల నారుణ్యంబు తారుణ్యంబు సంపాదింప కుండల
ద్వయమణిప్రభాపూరంబు గండమండలతాండవంబొనర్ప జగత్రిత
యైకాధిపత్యంబు దెలుపు రేఖాత్రయంబు కంఠంబునందనర కెందమ్మి
చెంతనున్న తుమ్మెదకొదమచందంబున కౌస్తుభోపకంఠంబున
శ్రీవత్సాంకంబు శోభిల్ల పంచవర్ణంబులం బ్రపంచించుచు పంచతత్వ
తత్వాభిమానికయైన మాలిక యొప్పార బాలప్రవాళలీలం దలపిం
చుచు బాహుశాఖల నఖర శిఖర కాంతులు విరాజిల్ల హారమంజీర
కంకణాంగదరోచులు దిక్కులంబిక్కటిల్ల కాదంబినీ సమావృత
గగనంబుపగిది నుదరబంధంబు సొంపార సంధ్యారాగసంవృత
శిలోచ్చయంబునా కనకాంబరపరివేష్ఠితకటిప్రదేశమ్ము భాసిల్ల
మధుకైటభ[1]హననవధ్యశిలాకల్పంబులైన జానువులు ప్రకాశింప
శంఖ చక్ర హల కుళిశ జలజాతపత్ర పతాకాదిరేఖాంకితంబులగు
పదంబులు విలసిల్ల చరణకాంతిసందోహవాహినిం [2]దేలియాడు
రాయంచగుంపుసొంపున నఖంబులు విరాజిల్ల నైంద్రజాలికుని
పోలిక మున్నుఁగైకొన్న యాకారంబు మాయించి సౌమ్యాకారంబు
దాల్చినిల్చినవాని శ్రీనరసింహదేవు నాలోకించి దండప్రణామంబులు
సమర్పించి కృతాంజలులై యిట్లని వినుతి సేయందొడంగిరి.

9


క.

జయజయ సితపద్మాక్షా!
జయజయ నిటలాక్ష! సర్వజగదభిరక్షా!
జయజయ దుర్జనశిక్షా!
జయజయ దితిసుతవిపక్ష! సదవన[3]దక్షా!

10


వ.

దేవా! జగత్సృష్టిరక్షణసంహారంబులకు కర్తవు జగదంతర్బహిర్వ్యాప
కుండవు సకలాంతర్యామివి పృథివ్యాదితత్త్వస్వరూపకుండవు శబ్దాది
గుణాత్మకుండవు సచ్చిదానందస్వరూపకుండవు అణువున కణువు మహ
త్తునకు మహత్తువు నీవ భవత్కటాక్షంబునంగాదె మధ్యేసముద్రం
బున భోగీంద్రతల్పంబున యోగనిద్రాముద్రితుండవగు నీనాభిపద్మం
బున బొడమిన పద్మజునకు మానసపుత్రులై మరీచిప్రముఖులు సృష్టి
పెక్కువిధంబుల గావించిరి నిమేషంబులు పదునెనిమిది కాష్ఠ యగు

  1. హననావంధ్య. పూ. ము.
  2. జేరి. పూ. ము.
  3. రక్షా. తా.