పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

(ఎ)ఏదేని శాసనము లేదా ఆచారము క్రింద వ్యధిత వ్యక్తికి హక్కు కలిగిన ఏదేని ఆర్థిక లేక ఆర్థిక వనరులను అన్నింటిని లేక కొన్నింటిని గాని ఆమెకు అందకుండా చేయుట, న్యాయస్థానపు ఉత్తరువుల ద్వారా లేక వేరేవిధంగా గాని ఆమెకు చెల్లించవలసిన వాటిని నిలిపి వేయుట, వ్యధితవ్యక్తికి సంబంధించిన ఏదేని స్త్రీధనం లేక ఆమె కలిగియున్న ఉమ్మడి లేక విడి ఆస్తి, ఉమ్మడి ఇల్లు నుండి రావలసిన అద్దె, మరియు మనోవర్తి ద్వారా ఆమెకు సంక్రమించవలసిన వాటిని సంక్రమించకుండా నిరోధించుట, వ్యధితవ్యక్తికి మరియు ఆమె పిల్లలకు నిత్యావసరములేగాక ఇతర అవసరాల నిమిత్తం ఆమెకు అవసరమైన వాటిని అందకుండా చేయుట;

(బి) వ్యధితవ్యక్తికి తనకుగల గృహ సంబంధమైన బంధుత్వము వలన ఉపయోగించుకొను హక్కుకలిగిన చర లేక స్థిరాస్తులు, విలువగల వస్తువులు, షేర్లు, సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటిని లేక వ్యధితవ్యక్తికి లేక ఆమె పిల్లలకు లేక ఆమెకు గల స్త్రీదన పూర్వక ఆస్తితో సమిష్టిగా గాని లేక విడిగాగాని హక్కు కలిగియున్న ఇతర ఆస్తులతో సహా విక్రయించుట లేక అన్యాక్రాంతము చేయుట; మరియు

(సి) వ్యధితవ్యక్తి గృహ సంబంధమైన బంధుత్వము వలన ఉమ్మడి ఇల్లులోనికి ప్రవేశించు హక్కుతో సహా ఉపయోగించుటకు లేక అనుభవించవలసిన వనరులు లేక సౌకర్యములను ఆమెకు లేకుండా చేయుట లేక నిరోధించుట.

విశదీకరణ-II :- ప్రతివాది యొక్క ఏదేని చర్య, కార్యలోపము, కార్యము లేదా ప్రవర్తన “గృహ హింస"గా పేర్కొనుటకు లేక నిర్ధారించుటకు ఈ చట్టము క్రింద సందర్భాన్ని బట్టి కేసుకు సంబంధించిన మొత్తం పూర్వపరాలన్నింటిని పర్యాలోచించవలెను.

అధ్యాయము-3

రక్షణ అధికారుల, సేవలు సమకూర్చువారి అధికారములు

మరియు కర్తవ్యములు మొదలగునవి

రక్షణ అధికారికి సమాచారము అందించుట మరియు సమాచారము అందజేసిన వ్యక్తి దాయిత్వము నుండి తప్పించుట.

4. (1) గృహహింస జరిగినదనిగాని లేక జరుగుతున్నదని లేక జరుగవచ్చునని ఒక వ్యక్తి విశ్వసించుటకు కారణమున్నచో అతడు దానిని గురించి సంబంధిత రక్షణ అధికారికి తెలియజేయవచ్చును.

(2) ఉప-పరిచ్ఛేదము (1)లోని ప్రయోజనము నిమిత్తము సద్భావనతో సమాచారమునిచ్చిన వ్యక్తి పై ఎట్టి సివిల్ మరియు క్రిమినల్ దాయిత్వము ఉండదు.