పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

(ఎస్) “రక్షణ అధికారి" అనగా 8వ పరిచ్ఛేదములోని ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే నియమించబడిన అధికారి అని అర్థము;

(ఒ) “రక్షణ ఉత్తరువు" అనగా 18వ పరిచ్ఛేదములోని నిబంధనలననుసరించి చేయబడిన ఉత్తరువు అని అర్థము;

(పి) “నివాస ఉత్తరువు" అనగా 19వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లోని నిబంధనలననుసరించి జారీ చేయబడిన ఉత్తరువు అని అర్థము;

(క్యూ) “ప్రతివాది" అనగా వ్యధిత వ్యక్తితో గృహ సంబంధమైన బంధుత్వమును కలిగియుండిన లేక కలిగియున్న మరియు ఈ చట్టము క్రింద ఎవరి నుండి వ్యధితవ్యక్తి పరిహారమును కోరుచున్నచో అట్టి ఎవరేని వయోజనుడైన పురుషుడు అని అర్థము;

అయితే, వ్యధితురాలైన భార్య లేక వైవాహిక సంబంధమైన బంధుత్వము కలిగి కలిసి జీవించుచున్న స్త్రీ కూడ భర్త యొక్క బంధువుపైన లేక పురుష భాగస్వామిపై ఫిర్యాదును చేయవచ్చును.

(ఆర్) “సేవలు సమకూర్చువారు” అనగా 10వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రిజిస్టరైన సంస్థ అని అర్థము;

(ఎస్) "ఉమ్మడి ఇల్లు" అనగా వ్యధిత వ్యక్తి ప్రతివాదితో కలిసి నివసించిన లేదా నివసిస్తున్న గృహము లేదా ఒంటరిగా నివసించిన గృహము అని అర్థము. ఆ గృహము వారిద్దరికి సంబంధించిన స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా వ్యధిత వ్యక్తి స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా ప్రతివాది స్వంత గృహము లేదా అద్దె గృహము లేదా ప్రతివాది ఒక సభ్యునిగా ఉన్న ఉమ్మడి కుటుంబమునకు చెందినదై ఉండవచ్చును. వ్యధిత వ్యక్తి లేక ప్రతివాదికి ఆ గృహములో ఏదేని అధికారము, హక్కు లేక హితము ఉన్నదా లేదా అను దానితో సంబంధము లేదు;

(టి) "ఆశ్రయ గృహము" అనగా ఈ చట్టము యొక్క ప్రయోజనముల నిమిత్తము రాజ్య ప్రభుత్వము చే ఆశ్రయ గృహముగా అధిసూచించబడిన ఆశ్రయ గృహము అని అర్థము;

అధ్యాయము -2

గృహహింస

గృహ హింస నిర్వచనము.

3. ఈ చట్ట ప్రయోజనముల నిమిత్తము ప్రతివాది. చేసిన ఏదేని కార్యము, కార్య లోపము లేదా కార్య నిర్వర్తన లేదా ప్రవర్తన వంటివి ఈ క్రింది పరిస్థితులలో గృహహింసగా పరిగణించబడుతాయి.--