పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005

(2005లోని 43వ చట్టము)

[సెప్టెంబరు 13, 2005]

కుటుంబములో సంభవించిన ఏ రకపు హింసకైనను గురయిన బాధితులకు భారత సంవిధానము క్రింద హామీ ఈయబడిన మహిళల హక్కులను అత్యంత కట్టుదిట్టంగా రక్షించుటకు మరియు వాటికి సంబంధించిన లేక అనుషంగికమైన విషయములను నిబంధించుటకైన చట్టము.

భారత గణరాజ్యపు యాభై ఆరవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది:-

అధ్యాయము -I

ప్రారంభిక

1. (1) ఈ చట్టమును గృహ హింస నుండి మహిళలను రక్షించు చట్టము, 2005 అని పేర్కొనవచ్చును.

(2)ఇది జమ్మూ కాశ్మీరు రాజ్యము మినహా యావద్భారత దేశమునకు విస్తరించును.

(3) ఇది కేంద్ర ప్రభుత్వము అధికారిక రాజపత్రములో ఆధి సూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్థము వేరువిధముగా కోరిననే తప్ప,--

(ఎ) "వ్యధిత వ్యక్తి" అనగా ప్రతివాది గృహ సంబంధ బంధుత్వము కలిగినదై లేదా కలిగివుండినదై, అట్టి ప్రతివాది తనను గృహ హింసకు గురిచేసినాడని ఆరోపించు చున్నట్టి ఎవరేని మహిళ అని అర్థము;

(బి) “బిడ్డ” అనగా పదునెనిమిది సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలిగిన ఎవరేని వ్యక్తి అని అర్థము మరియు ఇందులో దత్తత పొందిన బిడ్డ, సవతి బిడ్డ లేక పెంపుడు బిడ్డ చేరియుందురు;

(సి) “నష్ట పరిహార ఉత్తర్వు” అనగా 22వ పరిచ్ఛేదము యొక్క నిబంధనల ననుసరించి జారీ చేయబడిన ఉత్తరువు అని అర్థము;

(డి) "అభిరక్ష ఉత్తరువు" అనగా 21వ పరిచ్ఛేదపు నిబంధనలననుసరించి మంజూరు చేయబడిన ఉత్తరువు అని అర్థము;