పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

(డి) వ్యధిత వ్యక్తితో వ్యక్తిగతంగా, మౌఖికంగా లేక వ్రాతమూలకంగా లేక ఎలక్ట్రానిక్ లేక టెలిఫోన్ ద్వారా ఏదేని రూపంలోగాని సంభాషించుటకు ప్రయత్నించుటను;

(ఇ) మేజిస్ట్రేటు అనుమతి లేకుండా వ్యధిత వ్యక్తికి సంబంధించిన లేక ఆమె పేరు మీదున్న స్త్రీ ధనంతో సహా లేదా వ్యధిత వ్యక్తి ప్రతివాది పేర్లమీద ఉమ్మడిగా ఉన్న లేక వ్యధిత వ్యక్తి మరియు ప్రతివాది చే నిర్వహించబడుతున్న లేక అనుభవించుచున్న లేక విడివిడిగా లేక కలసి నిర్వహించబడుచున్న ఏవేని ఆస్తులను బ్యాంకు లాకర్లను లేక బ్యాంకు అకౌంట్లను ఉపయోగించిన లేక నిర్వహించుచున్న వాటిని అన్యాక్రాంతము చేయుటను;

(ఎఫ్) గృహహింసకు గురైన వ్యధిత వ్యక్తికి సహాయం అందిస్తున్న లేక ఆధారితులు, ఇతర బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తిని హింసకు గురిచేయుటను;

(జి) రక్షణ ఉత్తర్వులో నిర్దిష్ట పరచిన ఏదేని ఇతర చర్య చేయుటను; నిషేధించవచ్చును.

నివాస ఉత్తర్వులు.

19.(1) 12వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తును పరిష్కరించునపుడు మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి పై హింస జరిగినదని, రూఢిగా విశ్వసించిన మీదట--

(ఎ) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇంటిలో ప్రతివాదికి శాసనిక లేక న్యాయోచిత హక్కు ఉన్ననూ లేకున్ననూ ఆమె స్వాధీనములోవున్న ఆ ఉమ్మడి ఇంటి నుండి, ఆమెను వెళ్లగొట్టుటకు లేదా ఇతర విధముగానైనను ఇబ్బంది కలిగించకుండా ప్రతివాదిని అవరోధించుచూ,

(బి) ఉమ్మడి ఇంటి నుండి తొలగిపొమ్మని ప్రతివాదిని ఆదేశించుచూ;

(సి) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇంటిలోనికి ప్రతివాది లేక ఎవరేని అతని బంధువుల ప్రవేశమును అవరోధించుచూ;

(డి) ప్రతివాది ఉమ్మడి ఇల్లును అన్యాక్రాంతము లేక తాకట్టు పెట్టుట లేక అమ్మవేయుట నుండి అవరోధించుచూ;

(ఇ) మేజిస్ట్రేటు అనుమతి పొందిననే తప్ప ఉమ్మడి ఇంటిలో తన హక్కులను ప్రతివాది పరిత్యజించుటను అవరోధించుచూ; లేదా

(ఎఫ్) పరిస్థితులు అట్లు కోరినచో వ్యధిత వ్యక్తికి ఇంతవరకు ఆమె అనుభవించిన ఉమ్మడి ఇల్లునకు సమానమైన స్థాయిలో ఉన్న అలాంటి ప్రత్యామ్నాయ వసతిని ఏర్పాటు చేయమని లేక దానికి అద్దె చెల్లించవలసినదిగా ప్రతివాదిని ఆదేశించుచూ;

నివాస ఉత్తరువును జారీచేయవచ్చును:

అయితే, ఖండము (బి) క్రింద ఉత్తరువును ఏ మహిళ కైనను జారీ చేయరాదు.