పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వము యొక్క కర్తవ్యములు.

11. కేంద్ర ప్రభుత్వము మరియు ప్రతి రాజ్య ప్రభుత్వము ఈ క్రింది వాటికి సంబంధించి చర్యలన్నింటిని తీసుకొనునట్లు చూడవలెను, --

(ఎ) ఈ చట్ట నిబంధనలకు నియత అంతరావధులలో రేడియో, టెలివిజన్ మరియు ముద్రణ వంటి మాధ్యమాలతో సహా ప్రజా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారము ఇవ్యవలెను;

(బి) న్యాయక సర్వీసుల సభ్యులు మరియు పోలీసు అధికారులతో సహా కేంద్ర ప్రభుత్వ మరియు రాజ్య ప్రభుత్వ అధికారులకు ఈ చట్టములో పేర్కొనబడిన విషయములను తెలుసుకొని అవగాహన చేసుకొనుటకు నియతకాలిక శిక్షణ ఇవ్వవలెను;

(సి) గృహ హింసకు సంబంధించిన విషయములను మాట్లాడుటకు మానవ వనరులు, ఆరోగ్యం, శాంతిభద్రతలతో సహా ఆంతరంగిక వ్యవహారములు మరియు న్యాయ వ్యవహారాలతో వ్యవహరించుచున్న విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలచే అందించబడు సేవల మధ్య కట్టుదిట్టమైన సమన్వయం ఉండు విధంగాను మరియు ఆయా అంశాల పై నియతకాలిక పునర్విలోకనములను నిర్వహించవలెను;

(డి) న్యాయస్థానములతో సహా ఈ చట్టము క్రింద మహిళలకు సేవలను అందించడానికి సంబంధించిన మంత్రిత్వశాఖల కొరకు ప్రాధాన్యత విషయాల జాబితా (ప్రొటోకాల్స్) తయారు చేసి, ఒకచోట ఉంచవలెను.

అధ్యాయము - 4

పరిహారపు ఉత్తరవులను పొందుటకైన ప్రక్రియ

మేజి స్ట్రేటుకు దరఖాస్తు.

12.(1) వ్యధిత వ్యక్తి లేదా వ్యధిత వ్యక్తి తరఫున రక్షణ అధికారి లేదా ఎవరేని ఇతర వ్యక్తి, ఈ చట్టము క్రింద లభించుచున్న ఒకటి లేక అంతకంటే ఎక్కువ పరిహారములను కోరుచూ, మేజిస్ట్రేటుకు దరఖాస్తు సమర్పించవచ్చును:

అయితే, మేజిస్ట్రేటు అట్టి దరఖాస్తు పై ఏ ఉత్తరువునైనను ఇచ్చుటకు ముందు రక్షణ అధికారి లేక సేవలు సమకూర్చువారి నుండి సదరు గృహ సంఘటన నివేదికను పర్యాలోచించ వలెను.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద కోరబడిన పరిహారంలో, ప్రతివాది వ్యధిత వ్యక్తిపై జరిపిన గృహ హంసపరమైన పనుల వలన, వ్యధితవ్యక్తికి కలిగిన గాయములకు గాను నష్టము లేదా చెరుపు కొరకు దావా వేయుటకు అట్టి వ్యధిత వ్యక్తికి గల హక్కుకు భంగము కలుగకుండా నష్ట పరిహారము లేదా చెరుపు చెల్లింపు ఉత్తరువు జారీచేయడానికి గల పరిహారం కూడ చేరవచ్చును.