పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

వసుధన్ బిల్వదళంబు నీకు నొక టెవ్వండైన నర్పింప నిం
పెసఁగ న్వానికి న్విస్వవైభవము లీవీఁజూతుతువో యంచు భీ
తసహస్రాక్షచతుర్ముఖాదివిబుధుల్ దీప్తానిమేషైకదృ
ష్టి సదా చూచుచు వార లైరనిమిషుల్ శ్రీ...

35


మ.

హరి దా నెంతయనంతరూపమహితుం డైనన్ భవద్దివ్యస
చ్చరిత ల్వర్ణన సేయఁజాలఁడఁట యస్మాదృగ్జడశ్రేణికిన్
దరమా నిన్ బొగడంగ నింతయయిన న్వాఙ్మానసాతీతసు
స్థిరకళ్యాణగుణాభిరామచరితా శ్రీ...

36


మ.

నిజరేతోగతి నే నరుండ మరి నిన్ సేవించునాతండె దా
విజయుం డెందును నేతదర్ధమునకు న్వెయ్యేల నాసవ్యసా
చి జయశ్రేణికి సాక్షి యింక నొరులన్ జర్చింపఁగానేల యో
త్రిజగద్వంద్యపదారవిందయుగళా శ్రీ...

37


శా.

సాక్షాన్మోక్షఫలప్రదాతవు మహేశానుండ వైనట్టి ని
న్నాక్షేపించిన నెంతదక్షుఁడయినన్ హాని న్వెసం జెందు ప్ర
త్యక్షంబేకద మున్ను దక్షుఁడు త్వదీయావజ్ఞ గావించి తా
శిక్షం జెందుట సర్వలోకమునకున్ శ్రీ...

38


మ.

సతియౌ నీసతియే కుమారుఁడును నెంచ న్నీకుమారుండె యు
న్నతదివ్యాంబరమున్ ద్వదంబరమె నానాలోకసర్గాదివి
శ్రుతలీలన్ భవదీయలీలలె కడున్ రూఢంబులై సార్థక
స్థితి నొప్పారునుగాక యొండుదగునా శ్రీ...

39