పుట:కేయూరబాహుచరిత్రము.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ప్రధమాశ్వాసము

     కేతనమంత్రి దిగ్భరితకీర్తి వహించె నమాత్యకోటిలోన్.39
శా. పుట్టెం గుండని బంధుకోటులతపఃపుణ్యప్రభావంబుతో
     బెట్టెం బాదము భూమి నప్రతిమమై పెంపారు భాగ్యంబుతో
     గట్టెం జీర విరోధిమానవమనోగర్వప్రపంచంబుతో
     బట్టెం గంటము సర్వజీవభరణప్రౌఢవ్రతప్రీతితోన్.40
ఉ. భారతిదాది పెన్నిధులు బాలసఖుల్ తొలువిద్య నిశ్చలో
     దారత ధర్మకృత్యము లుదాత్తవిభూషణము ల్వివేకవి
     స్తారము యౌవనబంధుబుధసంగతి వ్రాత జనప్రశస్తి ది
     క్పూరితకీర్తితో యనిరధిభోగము భీమయ గుండమంత్రికిన్.41
సీ. పుణ్యనదీతీరభూమిఁ దాని లిపినపట్టిండ్ల విప్రగణంబుచేత
     సరసకవిత్వప్రసంగతిఁ దనుఁ బ్రీతిఁ గొనియాడు సత్కవిజనులచేత
     గర్పూరకస్తూరికాముఖద్రవ్యానుభవవేళ సభలోని ప్రభులచేత
     గాంక్షమైఁ దనుఁబొందఁ గాంతుమోయని యుపశ్రుతులు వోయెడువధూవితతిచేత
గీ. దానశక్తి బహుకథానిపుణత్వంబు, సులభభోగమహిమ సొబగుపేర్మి
     నెగడుచుండ వెలసె జగతీతలంబున, మంత్రిగుండఁ డమలమతిగురుండు.42
శా. శైలవ్రాతము వారిసత్వములు భాస్వత్ఫేనము ల్తారకా
     జాలంబున్ భుజగాధినాయకఫణానందన్మణుల్ గన్నముల్
     వేలాసేతువు చక్రవాళగిరి పృథ్వీనాథుసన్మంత్రిచూ
     డాలంకార మమాత్యగుండని సమిధ్యత్కీర్తిదుగ్ధాబ్ధికిన్.43
సీ. వడుగుఁ బెండిలిఁ జేయ వయసైన విప్రులఁ దడవి సేయించు నీపుడమియెల్లఁ
     దొడఁ బూయఁ గట్టంగ నిడఁ గల్గునట్లుగ సహకుటుంబులఁ గవిజనులఁ బ్రోచుఁ
     బాఠకగాయకప్రముఖుల మన్నించి యాందోళికాదివాహనము లొసఁగుఁ
     బాటించి కాకుళేశ్వరుతిరణాళ్ళలో నర్థుల కేటేట నర్థ మిచ్పు
గీ. ధర్మజుడు భానుజుఁడు తొంటి తప్పుఛాయ దేహ మేకమై పుట్టినతెఱఁగు దోఁప
     దామమును దానధర్మముల్ దన్నుఁ బొందె, మంత్రిభీమన గుండనామాత్యమణికి.44
చ. వలువుగఁ గాకుళేశుతిరునాళులలోపల గుండమంత్రి ని
     ర్మలమతిఁ బిట్టువేగముగ మాడలు రత్నచయంబు జల్లఁగా
     నలవడు హేమవృష్టిక్రియ నర్థులు చాతకకోటికాఁగ హా
     గలకొనరాలు ముత్యములుఁ గాఁగఁ బడున్ వడగండ్లకైవడిన్.45

.