పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

103

మత్తులో పడేసి నిద్రబుచ్చడం. ఈ విధమైన మత్తుద్వారా వచ్చిన ప్రశాంత స్థితిలో అర్థించడం జరిగితే దానికి ప్రత్యుత్తరం కూడా వచ్చినట్లే అనిపిస్తుంది. అయితే యిది దేవుడు బదులు పలకడం కానే కాదు. మీ చిత్ర విచిత్రమైన వూహాకల్పనల్లో నుండి వచ్చినదే అదీ. మీరు అడిగిన ప్రశ్నకు యిదే సమాధానం. కాని యింత లోతుగా విచారించి చూడటం మీకు ఇష్టం వుండదు. అందుకని ఒక ప్రశ్న వేసి వూరుకుంటారు. మీరు చేసే ప్రార్థన ఒక విన్నపం. ఏదో విధంగా మీ ప్రార్థనకు ప్రత్యుత్తరం సంపాదించాలని మీ తాపత్రయం. ఆ విధంగా మీ బాధలు తొలగి పోతాయని మీరనుకుంటారు. మీ హృదయాన్ని ఏదో ఒకటి రాచి రంపాన పెడ్తూ వుంటుంది. ప్రార్థనలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరే నిశ్చలనంగా, మత్తుగా తయారు చేసుకో గలుగుతారు. ఇటువంటి కృత్రిమమైన ప్రశాంతిలో ఒక ప్రత్యుత్తరం వినబడుతుంది. అది తప్పకుండా మీకు తృప్తి కలిగించేదే అయ్యుంటుంది. లేకపోతే దాన్ని మీరే ఆవతలకు నెట్టిపారేసి వుండేవారు. ఈ ప్రార్థన మీకు తృప్తి కలిగించేది కాబట్టే దాన్నీ మీరే తయారుచేసుకొని వుంటారు. మీరు స్వయంగా కల్పన చేసుకున్నదే మీకు సహాయపడుతున్నది. ఇది ఒక రకం ప్రార్థన. ఇంకొక రకం వున్నది, ప్రయత్న పూర్వకంగా మనసుని ప్రశాంతంగా, స్వీకార శీలంగా తెరచివుంచే వుద్దేశ్యంతో చేసే ప్రార్ధన. సంప్రదాయం చేత, గతం అనే నేపధ్యంచేత నిబద్ధీకృతం కావించబడిన మనస్సు మూసుకొని పోయి కాకుండా తెరచుకొని ఎట్లా వుంటుంది? తెరచి వుంచడం అంటే ఆవగాహన శీలత్వం; అంటే ఆలోచనకు అందనివాటిని గ్రహించే శక్తి కలిగి వుండటం, బంధించి వేసి, నమ్మకం అనే రాటకు మనసును కట్టి పడేస్తే అప్పుడది తెరచుకొని వున్న మనసు కాదు. ఉద్దేశ్య పూర్వకంగా తెరచివుంచుతే అప్పుడు ఆ మనసు అందుకునే ప్రత్యుత్తరాలు కూడా ఆ మనసు స్వయంగా తయారు చేసుకున్నవే అయివుంటాయి. మనసును నిబద్దీకరణం నుంచి తప్పించినప్పుడు మాత్రమే, ఒక్కొక్క సమస్యతల ఎత్తగానే దానితో తలపడటం ఎట్లాగో తెలిసినప్పుడు మాత్రమే- అప్పుడు మాత్రమే సమస్యలనేవే లేకుండా పోతాయి. వెనకటి నే పధ్యం కొనసాగుతూ వున్నంతవరకు సమస్యలు తయారవుతూనే వుంటాయి. అది ఎడతెగకుండా కొనసాగాలి అనుకుంటే సంక్షోభమూ, బాధలూ ఎక్కువవుతూనే వుంటాయి. స్వీకారశీలత్వం అంటే మనసుని తెరచివుంచగలిగిన సామర్థ్యం. అంటే 'వున్నది' ని నిందించడంగాని, సమర్థించడంగానీ లేకుండా స్వీకరించగలగడం. ఈ 'వున్నది' నుంచి పారిపోవాలనే మీరు ప్రార్థన ద్వారా ప్రయత్నిస్తుంటారు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

కొలంబో, 8 జనవరి 1950.