పుట:కువలయాశ్వచరిత్రము.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కువలయాశ్వచరిత్రము

కొద వొనర్పవె కూర్మికూఁతు నీక్షించి యుబ్బిన పద్మసంభవు పెద్దతనము
భావభవ యమ్మచెల్లగా నీవు చేత, సేజఁ బట్టిన నెవ్వారు నిలుచువారు
మారమణి నింతయేఁచిన యాఋతధ్వ, జేంద్రుఁ జెనకంగఁజాల వదేమొకాని.152

క. మారామపట్ల నీసుష, మారాజచ్ఛరము దాఁపుమా రాజ యిదే

మారాటమునకు నోర్వదు, మారాజముఖీమణీకుమారా మారా.153

క. అని మగువ యపుడు మగుడం, బని వడి పొగడ న్మధాంధపాంథజిగీషా

తనుతత్తురంగహేషా, ఘనతరఘోషాప్తి యొదవఁగాఁ గలఁగుటయున్.154

శా. చీనాచక్కెర ఖాణపుంబులుఁగుఁ దేజీజోదుకేదంగి బ

ల్సానాకత్తికిఁ దత్తరిల్లి నవలాసాయంసమారంభవే
లానాలీకినిలీల సొమ్మసిల బాలాపాలికల్ చంద్రకాం
తానర్ఘాంతికవేదిఁ జేర్చి బహుచింతాకంపితస్వాంతులై.155

సీ. మదనుగుణవ్యక్తిఁ బొదలెడు తేఁటులే మంచకింకను ఝంకరించఁ దొడఁగె

మానసప్రేమ యేమఱని రాయంచ లే మించికొంకక హుకరించఁ దొడఁగె
సహకారవృత్తిచే జరగు రాచిల్కలే కొంచకిక్కడ వెక్కిరించఁ దొడఁగె
ఘనమెత్రిచే నెమ్మిగను నెమ్మిగుంపులే ధృతియింకఁగా హంకరించఁ దొడఁగె
నేమి చేయుదుమే బోఁటి యింక నేటి, మాటలే పోటు మరునకు మగువమీఁద
నింతపగ యేల బాలవాఁ డేమి చేయు, మనలపాపంబు పొలియింప ననుచు మఱియు.156

ఉ. కొమ్మ చిగుళ్లు దెమ్మలతకూన విరు ల్గొనిరమ్ము పద్మినీ

తమ్ములు గొంచురమ్ము వనితామణికి న్ననశీతలోపచా
ర మ్మొనరించకున్న వలరాయని రాయడి నేమి పుట్టునో
యమ్మకచెల్ల యింకఁ దడయం బనిలేదని సంభ్రమంబునన్.157

సీ. ఆడుగునఁ బడవైచి రని దళం బెత్తునో నెత్తమ్మి పదముల నిలుప నేల

యంకంబునకుఁ దార్చి రని పొరవిచ్చునో యనఁటు లూరులచెంత నునుప నేల
యధరభూమిని నిల్పిరని మొనచూపునో చిగురాకు కెమ్మోవిఁ జేర్ప నేల
యంబకమ్ముల నుంచి రని యెఱ్ఱవాఱునో హల్లకం బక్షుల నలమ నేల
యిచట సమవస్తుసంయోగ మేల యమ్మ, యిదియుఁ బగవూనేె నేని నీయిగురుఁబోణి
తాళలే దమ్మ మీనేర్పు చాలునమ్మ, తరుణి యివి యెల్ల మదనసాధనము లమ్మ.158

క. అనుచుఁ బెనఁగొన్న తత్తర, మునఁ దగు శిశిరోపచారములు చేయుటయున్

మనసిజశిఖ బగ్గురుమన, నెనరునఁ దత్సఖులగుండె నెగ్గురు మనఁగన్.159