పుట:కువలయాశ్వచరిత్రము.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

తృతీయాశ్వాసము

క. శ్రీరమణీమృదుపదలా, క్షారసకోపారుణప్రసారితవీక్షా

దూరితవైరికలాపా, నారీనవకుసుమచాప నారనభూపా!1

గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁదొడంగె

నట్లు పాతాళకేతుఁ డయ్యాతుధాన, పటలికన్నను మున్నుగాఁ బాఱుదెంచి.2

క. దళవాయితోడఁ గోటకు, వెలుపటియిల్లిల్లు గొట్టివేయించి పిరం

గులు లగ్గంబులమీఁద, న్నిలిపించఁగఁ బనిచి నిగుడు నెవ్వగతోడన్.3

చ. అరిగి పురంబు సొచ్చి పలలాశనమౌళి కుమారుతోడ మే

ల్సరియగు దైత్యులం గవనుల న్నిలువ న్నియమించి యాయస
స్ఫురణఁ దనర్చు కోటతలుపు ల్బిగియించఁగఁ బంచి ధీరతా
స్థిరమతిఁ జేరఁగా నగరుఁ జేరి హజారమునందు నిల్చుచున్.4

క. మించు తమిఁ గణజము ల్దెఱ, పించుచుఁ గైజీతములకు వేర్వేఱ న్వ్రా

యించుచు నెలకొలువునకుం , బంచియిడుచు మందుగుండుబాణములెల్లన్.5

క. ఇటు లండ నచట నృపుఁ డు, ద్భటగతి దానవుని కూటిపాలెం బెల్లం

దటుకునఁ జూఱ లొసంగుచు, నటు నిలువక సేనతోడ నప్పురిఁ జుట్టెన్.6

చ. అచలితవృత్తి నిట్లు విడియం దళవాయి పటాశి వీడు మే

చ్చుచు నలకోట కేగు జలసూత్రపుఁజోటు లెఱింగి యడ్డ క
ట్టుచు రసవర్గ మచ్చట కడున్వడిఁ జేరఁగనీక శూరతా
రచనలఁ జిల్లరల్చలుపు రక్కసిపాలియగాండ్రఁ గొట్టుచున్.7

క. ముత్తికె వేయించిన దితి, జోత్తముఁ డించుకయు బెదర కుద్భటధీరో

దాత్తమతి నగరు సొరక వి , యత్తటి నటునూకు గమనియందె వసించెన్.8

సీ. తెఱగంటిదొర నరాధిపు మెచ్చఁ జనుటకై నలువతో నాలోచనంబు సేయ

నిలనుండి వచ్చు వేగులవారి వెంటనే సురమౌని గొణుగుచు సుద్దు లడుగ
గిరిభేది నగరివాకిటివార్త లడుగంగ దిగధీశులు నియోగి తెగల నంప
అడ్డెలు విడి వేల్పు లమరగాం డ్రసురేంద్రుకార్యకర్తలబందు గట్టికొనఁగ
భూరిభుజశక్తి మ్రుచ్చిమిపోటు గాఁగ, మేదినీభర్త పాలెంబుమీఁదఁ బడిన
దానవులమూఁక తన్మహోత్కటభటోగ్ర, ధాటిఁ గ్రేడించి క్రమ్మఱఁ గోటఁ జేరు.9