పుట:కువలయాశ్వచరిత్రము.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మారుఁడు రంగరాజనియు మూర్తిమాంబకుమారుఁడు నారాయణరాజనియు రంగరాజుకుమారుఁ డగు కృతికర్తను రంగరాజు సోదరునికుమారుఁడగు వేంకటరాజును మూర్తిమాంబ కుమారుఁడగు కృతిపతి నారాయణరాజు పెంచుకొనెనని పీఠిక చెప్పుచున్నది.

ఇతని కవిత్వమతిప్రౌఢమై సలక్షణమై నవరసభరితమై వినువారిచెవులకుఁ జవులుగొల్పుచున్నయది. ఇతనికిఁ గల యపూర్వవస్తుకల్పనాచాతుర్యము మనకవికుటుంబములో నలుగురైదుగురికిఁ దప్ప నెవ్వరికిని లేదని నొక్కి చెప్పవచ్చును. ఒక్కొకచో నితఁడు వర్ణించిన విషయముం జూచిన నితనికి సముఁడగు కవి లేఁడనియే తోఁపించుచుండును. ఇందుఁ గావ్యలక్షణములగు సమస్తవర్ణనలు వర్ణింపఁబడినవి. ఇందలికథ పింగలి సూరనార్యని కళాపూర్ణోదయమువలె నాటకశైలిగా నున్నది. దీనిమూలకథ మార్కండేయపురాణములో నున్నది. దానికిని దీనికినిఁ గొన్నివిషయములలో వ్యత్యాసము కలదు. అందు మదాలస చచ్చిపోయిన పిదప నశ్వతరుఁడను నాగరాజు తపము చేసి మదాలసవంటి కన్యకను తనమధ్యఫణమునుండి పుట్టించి మరలఁ గువలయాశ్వున కిచ్చినట్లున్నది. చచ్చిపోయినదానిని మరలఁబుట్టించునా యనుసందేహముచేఁ గాఁబోలు నీకవి యట్లు చెప్పక మఱియొకవిధముగా మార్చినాఁడు. ఇత్యాదిభేదములు కొన్ని కలవు. ఈకథ విచిత్రరామాయణములోఁ గూడ నున్నది. ఎందెట్లున్నను నీకవి కథాకల్పనయం దద్బుతశక్తి కలవాఁడు. ఈకథనే నాటకముగా వ్రాయఁబూనినచో వేఱ యితివృత్తము గల్పింప నవసరమే లేదు. తినఁబోవువారికి రుచిఁ జూపింపనేల యని యిందలి యత్యుత్తమవర్ణనలు కలపద్యముల నిం దుదాహరింపమైతిమి.

ఈగ్రంథమును దంజావూరు సరస్వతీభాండాగారమునుండి యక్కడి యఱవవారిచే వ్రాయించి తెచ్చుటచేతఁ గొన్నివ్రాఁతతప్పులును గొన్ని గ్రంథమందలి లుప్తభాగములును గల యొక్కప్రతియె మాకు దొరకుటచే దాని ననుసరించి యథామతి లుప్తభాగములను వ్రాఁతతప్పులను శతావధానులు తిరుపతివేంకటేశ్వరకవుల సహాయమున బరిష్కరించి మాసరస్వతీపత్రికయందుఁ బ్రచురించితిమి. బొత్తిగా సవరించుటకు వీలు లేనివి సవరించినఁ గవియభిప్రాయమునకు భిన్న మగునేమోయని విడిచితిమి. ఎవ్వరియొద్దఁ గాని మఱియొకప్రతి యున్నచో దయయుంచి మాకుఁ బంపినయెడల భేదములు సరస్వతిలోనుండి పునర్ముద్రితము లగుప్రతులలోఁ జేర్చెదము.

ఇది సవరించుటలో నిజముగాఁ కొత్తగ్రంథము వ్రాయఁదగినంత పరిశ్రమపడితి మనుటకు సందేహము లేదు. అట్టిదైనను నెచ్చటనోయున్న దతికష్టముచే సంపాదించినదైనను నుత్కృష్టమగు రసవత్ప్రబంధమైనను నావ్యయప్రయాసలు మేమే భరించి పాఠకులకుఁ దక్కువవెలకే యిచ్చుచున్నాము.

ఇట్లు, ఆంధ్రభాషాభిమాని,
శ్రీ కొ. రా. వెం. కృష్ణరావు.
సరస్వతీపత్రికాధిపతి.