పుట:కువలయాశ్వచరిత్రము.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈకువలయాశ్వచరిత్రము సవరము చిననారాయణనాయకునిచే రచియింపఁబడి నారాయణభూపాలున కంకితమీయఁబడినది. కృతికర్త కీకృతిపతి పెంపుడుతండ్రి. ఇతఁడు తనవంశమునకుఁ గూటస్థునిగా సూర్యుని వర్ణించుటచేత కు క్షత్రియుఁ డనియే తోఁచుచున్నది. కాని నాయకపద మేల వచ్చెనో తెలియకున్నది. మనదేశమం దీనాయకపదము తఱచు శూద్రులయందుఁ గలదు. మఱియును మనదేశమున నచ్చటచ్చట బొబ్బిలిపాటగాండ్రు పాడు పాటలలో తిమ్మరాజుపాటలో "సవరము నారప్ప" యనువానిచరిత కొంత గలదు. ఆనారప్పడు యీకృతిపతి యేమో యని శంక వొడముచున్నది. ఈ కృతిపతితండ్రిపేరు తిమ్మరాజు. ఈతిమ్మరాజు మిక్కిలిప్రసిద్ధుఁడు. ఎంతవఱకు నిజమో తెలియదు. మఱియు నీకవి కాశ్యపగోత్రజుఁడౌట కూడ నాయకపదపక్షమునే రూఢిపఱచుచున్నది. ఏది యెట్లున్నను గంఠోక్తముగా క్షత్రియులక్రింద వర్ణించుకొనినప్పుడు మనమును క్షత్రియులనక తీరదు . ఈకవి తనపూర్వులను వర్ణించినపద్యములు చూడఁగా వీ రనేకయుద్ధములలోఁ దురుస్కరాజుల నోడించినట్లును విస్తారదేశము పరిపాలించినట్లును గనఁబడుచున్నది. తనకన్నతండ్రికి సవతితమ్ముండును తనకుఁ బెంపుడుతండ్రియునగు కృతిపతిని వర్ణించు నప్పుడొకచో "శ్రీరంగరాజకుమార వీరవేంకటరాయభుజాబలసహాయ వివిధోపాయధురీణుం" డను నొకవిశేషణము కలదు. దానింబట్టి చూడ నీయిరువురును మిత్రులని తోఁచినను "గర్ణాటాధీశ్వరదయాసాంద్రుండగు నారాయణేంద్రుం" డనియు "వీరవేంకటరాయభూవిభుకరుణ నెలమిఁ బాలించె నిల నారనేశ్వరుండు” అనియుఁ జెప్పుటచే నావీరవేంకటరాయల కీకృతికర్త సామంతరాజని విస్పష్టమగుచున్నది. ఈవీరవేంకటరాయలు కర్ణాటరాజనుట చేతను రంగరాజకుమారు డనుటచేతను గృష్ణదేవరాయుల యల్లుఁడగు అళియరామరాజు తమ్ముఁడనియే యూహింపవలయును. వసుచరిత్రకృతిపతియగు తిరుమలదేవరాయని తండ్రి రంగరాజనియు నన్న రామరాజనియు వసుచరిత్రమే చెప్పుచున్నది. కావున నీవీరవేంకటరాయులు తిరుమలదేవరాయలకును దమ్ముఁడే. ఈవీరవేంకటరాయలు (1580 సం॥ న) జంద్రగిరిలోఁ బట్టాభిషిక్తుఁ డగుటవలన మనకృతిపతియు నాతనికి సమకాలికుఁడు. కావున నితఁడును 16 శతాబ్దము చివర నున్నవాఁడు. కాఁబట్టి యతనికి దత్తకుమారుఁ డగుకృతికర్త 17వ శతాబ్దము మొదటివాఁడని విశ్చయింపవలయును. 'తనదానగుణము గోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించు నొనరఁగ' ననుటవలన నీకృతిపతి కృతికర్తలు గోదావరిరిమండల మేలినవారేమోయని భ్రమ కలుగుచున్నది. కృతికర్త రాయభూపాలకుమారుఁ డని కవులచరిత్ర చెప్పుచున్నది గాని రంగరాజకుమారుఁడుగాని రాయభూపాలకుమారుఁడు కాఁడు. కృతిపతితాత యగు తిమ్మరాజునకు తిరుమలాంబ మూర్తిమాంబ రంగమాంబ లక్ష్మమాంబ కొండమాంబ గురవమాంబ యను నార్గురు జీవత్కళత్రములు కలరనియు నందుఁ దిరుమలాంబకు