పుట:కాశీమజిలీకథలు -09.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

91

వినుము. మహారాజవంశ ప్రసూతుండై కిరాతకులజుండని కొంతకాలము వాడుక పొంది యుండును. మహారణ్యమధ్యంబున వసించియు నీజయంతముకన్న శోభావంతములగు సౌధాంతరముల మెలంగఁగలఁడు. స్వల్పకాలంబునఁ జెఱసాల నుంపఁబడియు బాహుబలంబున ననన్యసామాన్యుఁడని ప్రఖ్యాతి వహింపఁగలడు. స్వర్గభ్రష్టుండయ్యె నను మాటయేకాని యింతకన్న నెక్కువ భోగముల ననుభవింపఁగలడు. దివ్యకాంతావియోగంబు వహించెనను మాటయేకాని యింతకన్న మిక్కిలి చక్కఁదనముగల రాజపుత్రికలంగూడఁగలఁడు. మఱియు నీఖగంబులు వియోగకాలంబున వీనికి వినోదములు గలుగఁజేయుచుండును. వీని సంయోగకాలమే యితని సుఖానుభవకాలము. అని వరంబులొసంగి యా సిద్ధుండు మహేంద్రుని సంతోష పెట్టెను.

కథ కంచికిబోయెను, నే నింటికివచ్చితిని. ఇంతియే నాకు వచ్చునని యా పక్షి యెఱింగించినంత నాలించి యాయించుబోఁడి తత్పూర్వోత్తరసందర్భము లన్నియు హృదయంబున ననువదించుకొని విస్మయసంతోషపరాధీనమానసయై యొహోహో! ఈ శకుంతములు వింతలపై వింతలు దెలిపినవి. యేమి? నా భాగ్యము! తరువాయి కథావృత్తాంతము చెప్పకయే స్పురింపుచున్నది. ఆ పారావతశకుంతములే యీ పక్షులు. ఆ జయంతుఁడే రాజవాహనుఁడు. అని యాలోచించుచు సంతోషాతిశయంబున నాట్యముజేయఁ దొడంగినది.

రాజవాహనుండు కిరాతకుమారుండు కాఁడు. రాజపుత్రుఁడని యెఱింగినప్పుడు వివశయైపోయిన జవరాలు జయంతుని యవతారమని వినినప్పుడెట్టి ప్రహర్షము వహించునో యూహించుకొనవలసినది.

అంతలో రాగవతివచ్చి అమ్మా! అదేమి? వెఱ్ఱిదానివలెనట్లు చిందులు ద్రొక్కుచుంటివేల? రాజవాహనుఁడు ఈపక్షిం దెచ్చిన పుళిందవృద్ధునితో మాట్లాడి తన యింటియొద్ద వార్తలువిని జయపురంబున కరుగఁ దొందరపడుచున్నాఁడు. నీతోఁ జెప్పుమని నన్ను పంపెనని చెప్పినది. అదివోయి యాతని వెంటఁబెట్టుకొని వచ్చినది.

కల్పలత యతని నుచితాసనాసీనుం గావించి మహారాజకుమారా! మీయింటి వార్త లేమి వింటిరి? ఎఱింగింపు డనుటయు నతండు మాతండ్రి మద్వియోగమునకు వగచుచుఁ బులుగుజంట విడఁదీసినందులకై తనకీ యఘ మంటినదని నిశ్చయించి మా విహంగమంబు నీకడ కంపిరటకాదా? మీ యభీష్టమే నెరవేరినదిగదా. అది యట్లుండె నేను మధువర్మచేఁ జెర పెట్టఁబడితినని విని యాగ్రహగ్రస్తచేతస్కుండై శబరసేనలం గూర్చుకొని జయపురంబు ముట్టడింపనరుగుచున్నాఁడట. నేను బోయి వారికి, దోడ్పడ వలయును. అనుజ్ఞ యిమ్ము. మా పతంగ మెందున్నదియో చూపుము. ముద్దుపెట్టుకొని పోయెదనని పలికిన విని రాజపుత్రి యిట్లనియె.

మనోహరా! మీ పెంపుడుఖగమును భార్యతోఁగూర్పక యెట్లుపోయెదరు?