పుట:కాశీమజిలీకథలు -09.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

కనకలతిక కథ

67

మంతయు మాకు మా పతంగము జెప్పినది మధువర్మ జయపురమన నేదియో యనుకొనుచుంటిమి. ఆహా! ఈ సుమతి మహానుభావుండు. జితేంద్రియుండు. ఈ కథ సగముఁ జెప్పి మాగువ్వ యవ్వల తనకు రాదన్నది. తరువాయి చరిత్రము చాల భాగము నీవు చెప్పితివి. ఈ సుమతియే శత్రువులంగూడి విజయపాలుని మట్టుపరచెనని నే నంటిని. అతండు మహాగుణవంతుఁ డట్లు చేయఁడని మాయన్న వాదించెను. మా యన్న మాటయే గెలిచినది. ఇట్టి యుత్తముఁడు మన కాశ్రయుఁడై యుండ మన కార్యము నెరవేరుట కేమియు సందియము లేదని చెప్పుచు దిన్నఁగబోయి యతని పాదములకు నమస్కరించినది.

అభీష్టవరలాభసిద్ధిరస్తు అని యాశీర్వదించెను. ముసి ముసి నగవుతో శ్రమణి మహాత్మా ! నీ చరిత్ర మంతయు విని యుంటిమి. నీవు సర్వజ్ఞుఁడవు. హృదయాశయముల గ్రహింపఁ జాలుదువు. నీ యాశీర్వచన మమోఘమగు వరంబగు గాఁక. ఈ చిలుక మా యన్న విముక్తుఁ డయ్యెనని చెప్పినది. తద్విము క్తికి మీ రభయహస్త మిచ్చితిరఁట. ఇప్పుడు మన మందుఁ బోవుదుమా ? అని యడుగుటయు నతండు చిలుకపలుకుల కన్యధాత్వ ముండదు. ఈ సునందుఁ డందలి తత్వము దెలిసికొంటినని చెప్పెను. మీ యన్నకు నీకుఁ గూడ గులముమీఁద గీటుపెట్టినదట. ఆ విషయము ముందు విచారింతముగాక. ఇప్పుడు మనమందరముగలసి జయపురంబున కరుగుటయే యుచితమని పలుకుచు నాదివసం బం దుండి తానుగూడ జిలుక నొక పశ్న మడిగెను. అప్పుడు పృచ్ఛకు లంతవిశేషముగా లేమింజేసి యతని ప్రశ్నమున కాదివసమే యుత్తరము చెప్పినది

నీవడిగిన పురుషుఁడు సజీవుఁడై కుటుంబవృద్ధి గలిగియున్న వాఁడు.

ఆదిత్యవర్మ యా యుత్తరము విని సంతోషాయత్తచిత్తుఁడై యేదో తన డెందమున వింతకథఁ గల్పించుకొని యిట్లు జరుగునని యాలోచించుకొనియెను.

మీ ప్రశ్నమునకుఁ దగిన యుత్తరము వచ్చినదాయని యడిగిన శ్రమణితో నీ శుకము దైవమువంటిది. దీనిమాటలయం దొక్కటియు నసత్యముండదు. మీయన్న యీ పాటికి విముక్తుఁడై యుండు నందుఁ బోవుదమని పలుకుచు వారితోఁగూడ బయలుదేరి జయపురంబున కరిగెను.

182 వ మజిలీ

కనకలతిక కథ

దేవీ! కనకలతికా! పుడమిలో సౌందర్యవంతులగు పురుషులు లేరని నిరసించుచుందువు. మన చెఱసాలలోనున్న యువకునిం జూచిన భూలోకమును నిందింపవుగదా?