పుట:కాశీమజిలీకథలు -09.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమణి కథ

59

భూనభోంతరాళము నిండ శ్రమణి నా పట్టణపురవీథుల నూరేగింపుచుండిరి. క్రమంబున నయ్యూరేగింపు నాఁటిరాత్రి యుత్సవముకన్నఁ బెద్దదైనది. వీథులన్నియు జనులచే నిండింపఁబడినవి. దేవునికివలె హారతు లిచ్చుచు, పుష్పములం జల్లుచు ఫలము లర్పించుచు నానావిధోపచారములచేఁ బ్రతిగృహస్థుఁడు నతని నారాధించుచుండెను.

అ ట్లూరేగింపుచుఁ గ్రమంబునఁ గోటలోనికిఁ జేరినంత రాజుగారు, నల్లుఁడు గొంతదూర మెదురువచ్చి చెరియొకప్రక్కను నిలిచి పల్లకీదండ పట్టికొని వింజామరల వీచుచు సభాంతరాళమునకుఁ దీసికొనిపోయిరి.

పల్లకి దింపినతోడనే నృపతి యతనికిఁ కైదండ నందిచ్చి లేవదీయఁబోవుటయు వారించుచు శ్రమణి తానే తటాలున లేచి వారివెంటఁబోయి తన్నిర్దిష్టమగు రత్నపీఠంబునం గూర్చుండెను. అప్పుడు నృపతియు నల్లుడును బ్రక్కల నిలువంబడి వీటోపులు విసరుచుండ వారించుచు బలవంతమున గారిని గూర్చుండఁ బెట్టినది.

ప్రజలసమ్మర్ధ ముడిగినపిమ్మట శ్యామల సఖీశతపరివృతయై వచ్చి తత్పాదంబులంబడి నమస్కరింపుచు మహాత్మా? నీవు భగవంతుఁడవై వచ్చి మాయాపద దాటించితివి. నాఁడే నీకొరకు వెదకించితిమి అదృశ్యుండ వైతివి. నేఁడు మద్భాగ్యవశంబున దర్శనన మిచ్చితివి. నీ కులశీలనామంబు లెట్టివో యెఱింగించి శ్రోత్రానందము గావింపుఁడు. ప్రాణదాతవైన మీవృత్తాంత మెఱుంగుటకు మిగులఁ గుతుకముగా నున్నది. అని యనేకప్రకారముల స్తుతియింపుచుఁ బూసురటితో విసరుచున్న యబ్బిసరుహానన కృతజ్ఞత్వమునకు మెచ్చుకొనుచు శ్రమణి వారినెల్లఁ గూర్చుండ నియమించి యిట్లనియె.

మహారాజా! సత్పురుషులు కొంచెముపాటి యుపకృతియుఁ గొప్పగాఁ జెప్పికొందురు? మీయం దట్టిధర్మము గనంబడుచున్నది. ఈమె రాణివాసము విడిచి ప్రాణదాత నను తలంపుతోఁ బరుండ నని శంకింపక నాకడకు వచ్చి తన కృతజ్ఞత్వమును వెల్లడించుచున్నది. మీరు గూడ నన్ను గొప్పఁ జేసి యతీతములగు నుపచారములు చేయుచున్నారు. ఇది యంతయు మీ సాధుశీలత్వము కాక వేరొకటికాదు వినుండు.

నేను దుందుభియను పుళిందచక్రవర్తి కుమారుండ నన్ను మహిళాంగుం డండ్రు. మాయన్న రాజవాహనుఁ డనువాఁడు. మా యిరువురపోలికయు నొక్కటిగా నుండుటచే నేనే యాతండని మీరు భ్రమపడి యీ యుపచారములఁ జేయుచున్నారు. అతండు కొలఁది కాలము క్రిందట మహేంద్రనగర మరుగుచు నీయూరు వచ్చి మీయాపదఁ దప్పించియుండును. అతనిని జయపురంబున నన్యాయముగా మధువర్మ యనురాజు చెఱసాలం బెట్టించెనని విని నే నందరుగుచు మార్గవశంబున నీవీఁడు చేరితిని. నా మాట వినిపించుకొనక మీ రందఱు నా కపూర్వగౌరవము గావించితిరి.