పుట:కాశీమజిలీకథలు -09.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిత్యవర్మ కథ

51

ఇంతలో నొక గుఱ్ఱమెక్కి యొక వీరపురుషుఁ డచ్చటికివచ్చి సత్రమున కవకాశము దొరకలేదా? అని రాజభటుల నడుగుటయు వాండ్రు దేవా! ఇందొక బ్రాహ్మణుఁడు బసఁజేసి వంటఁ జేయుచున్నాడఁట. పొమ్మనినఁ బోవకున్నాడు. సత్రము మనదని యెఱుఁగడు. తమ సెల వైనచో లోపలఁ బ్రవేశించి యీవలకు లాగికొని వత్తుమని పలికిన విని యా వీరుఁడు తొందరపడకుఁడు. భుజించు బ్రాహ్మణు నవమాన పరుపరాదు. మఱికొన్ని గదులు లేవా? అని యడిగిన వాండ్రు దేవా? గొప్పవారు దిగు గదు లివియే. తక్కినవి బాటసారులు సామాన్యులు దిరుగుచుందురు. అని ప్రరిశుభ్రముగా నుండవని పలుకుచుండఁగనే భుజించి యాదిత్యవర్మ యీవలకు వచ్చి గుర్రముపైనున్న వీరపురుషునిఁ బరిశీలించి చూచుచు అమ్మా? మేము తెలియక యిందుఁ బ్రవేశించితిమి. నా భోజనమైనది. భృత్యు లీవలఁ గుడుతురు. ముహూర్తకాలములో గది చోటు చేయుచుంటిమి మీరు ప్రవేశింపవచ్చునని పలికిన విని యా వీరుఁడు గభాలున గుర్రము దిగి యా విప్రునకు నమస్కరింపుచు మహాత్మా? క్షమింపుఁడు. మా భటులెఱుఁగక మిమ్ము లేచిపొమ్మనిరి. అది నా యభిప్రాయము కాదు. మీ వంటి యుత్తములు నిమిత్తమే యీ సత్రములు నిర్మింపబడినవి. మేము మఱియొక గదిలో వసింతుము. మీరు సావధానముగా విశ్రమింపుఁడు. అని పలుకుచు జనాంతికముగా నన్ను మీ రమ్మా! అని సంబుద్దిఁ జేసి పిలిచితిరి. మరచి యట్లు పిలిచితిరా? అని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.

వేషము మార్చిన భాష మారునా? రూపము మారునా ? ఎఱుఁగనివారలకుఁ దెలియక పోవచ్చును. మాకుఁ దెలియదా? మొగముఁ జూచినతోడనే గ్రహించితి నని పలికిన నవ్వీరుఁడు ఆర్యా! మీ రెందలివారలు! ఎందుఁ బోవుచున్నారని యడుగుటయు నతం డిట్లనియె.

నేను మహారాష్ట్ర దేశప్రభువునకు మిత్రుఁడ. నాపే రాదిత్యవర్మయండ్రు. నే నాఱేనియానతి నేనుఁగులు, గుఱ్ఱములు, సింహములు లోనగు మృగంబులఁ గొనుటకై దుందుభియను పుళిందునొద్ద కరుగుచున్నవాఁడ నని చెప్పుటయు నావీరుఁ డతని చేయి పట్టుకొని చాటునకు దీసికొనిపోయి యిట్లనియె.

మహాత్మా! నిన్ను సర్వజ్ఞు డనవచ్చును. నీ మొగంబున నద్భుత తేజం బొలుకుచున్నది. ని న్నాత్మబంధువుగాఁ దలంచి నా వృత్తాంత మెఱింగించెద నాలింపుము. నేను మహేంద్రనగరాధీశ్వరుండగు వసుపాలుని కూఁతురు కల్పలత యను దాని సఖురాలను. నాపేరు అశోకవతి యండ్రు. మాఱేనిపట్టి పంపున నేనా పుళిందు నొద్ద కరిగి రాజవాహనుండను వానికుమారుని అసమానరూపరేఖావిలాసు నింటికడ సుఖంబుగా నుండనీయగ మాటల నేర్చిన పక్షి నిత్తునని చెప్పి యిల్లు వెడలించితిని. వాఁడు తెలియక జయపురమార్గంబునఁబడి యా వీటిరాజమార్గంబున గుఱ్ఱమెక్కి యరుగుచుండ దుర్మార్గులైన యా రాజులు వానిం బందీగృహంబునఁ బెట్టించిరఁట. ఇఁక