పుట:కాశీమజిలీకథలు -09.pdf/243

ఈ పుట ఆమోదించబడ్డది

248

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యిట్టి ప్రకటన పత్రికఁ గట్టించినది తెలియని వారు పెక్కండ్రు వోయి యా బ్రహ్మరాక్షసున కాహార మగుచున్నారు. మీ రిందు నిలువక మీ దారిం బొండు. ఎఱుఁగని వారి కీవార్తఁ దెలుపుటకే యీ యూరివారి చేత మేమిందు నియమింపఁబడితిమి అని యా వృత్తాంత మంతయు వా రెఱింగించిరి.

ఆ వార్తఁ విని ధాత్రీసురు లాత్రము జెందుచు బాబో! ఇందుండరాదు. తెలియక వచ్చితిమి. అని పలుకుచు వెఱపుతో నా యరుగు దిగి వీథి నిలువంబడి వేఱొక చోటికిఁ బోవుదము రండని విక్రమార్కునిం జీరిరి. అతండు నవ్వుచు విప్రులారా? మీరిట్లు వెఱచెదరేల? మీ మంత్రబలంబున నా బ్రహ్మరాక్షసుని హతము గావింపలేరా? కానిండు మీరింటికిం బోవుఁడు నేనీ రాత్రి యిందుండి ప్రొద్దుట సొమ్ము తీసికొనివచ్చెద. బ్రహ్మరాక్షసునకు నేను వెఱవనని పలికి యా యరుగు దిగకున్నంత నా పౌరులు బాబూ! నీ పుణ్యము మాకు సొమ్మక్కరలేదు. జన్నమిప్పుడు కాకున్న వేఱొకప్పుడు సేయఁగలము మా దారిని మేము పోయెదము. నీ వూరక చావకుము. రమ్ము రమ్ము అని పలుకుచు నాతని బలవంతమునఁ గ్రిందకు లాగికొని వచ్చి యిట్లనిరి.

సీ. బ్రహ్మరాక్షసునిచేఁ బడకుండ బ్రతికి యి
               క్కడకు వచ్చుట మొక్కగండ మదియ
    దాటిన వేశ్య విత్తము నిత్తు నన్నది
               యీయంగఁదగుగదా? యిచ్చెనేని
    యాధనంబంది బేది బేహారి మున్నట్లు
               వారువం బీయంగ వలయుఁ గాదె
    యిచ్చిన యంతనే వచ్చెనో విత్తంబు
               గెలువంగఁ దగుఁగదా తొలిపణంబు
గీ. ఇన్ని గండంబులును గతియించినపుడు
    కాదె మా కోర్కె తీరుట? కదలిరమ్ము
    వలదు పుణ్యాత్మా! యిందుఁ బోవంగ వలదు
    సొమ్మునందలి యాసఁ జచ్చుట గుణంబె.

అని పలికిన విని నవ్వుచు నవ్వసుధాపతి నా కేమియు వెఱపులేదు. సులభంబున వానిం గడతేర్చి సొమ్ము తెచ్చెద. మీరు బసకుఁ బొండని యెంత జెప్పినను వినక యతని వెంటఁ బెట్టికొని యాజన్నిగట్టులు సత్రంబునకుం బోయిరి.

ఉన్నట్లే యుండి చీఁకటి పడినతోడనే విక్రమార్కుండువారికి దెలియకుండ వేఱొక మార్గంబున భోగము దాని యింటికిం జని వీథి తలుపుగొట్టెను. దాని పరిచారిక వచ్చి తలుపు తీసి మీరెవ్వరని యడిగినది. నేనొక విటుండ. మీ గోడకుఁ గట్టిన ప్రకటన పట్టము జదివికొని ప్రభావతిఁ జూడ కరుదెంచితిని. అందు వ్రాయఁ