పుట:కాశీమజిలీకథలు -09.pdf/179

ఈ పుట ఆమోదించబడ్డది

184

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

విక్ర - భద్రా! నిజము చెప్పుము, లేకున్న నిన్ను మా మిత్రులనుండి తొలగింతుము.

భద్రా - దేవా! మఱి యేమియును లేదు. ఆ దేవి కోవెల మ్రోల నగాధమగు తటాక మున్నది దుడుకుతనంబున నందుఁ బడుదుమనియు నాయమ్మరూపము భయంకరముగా నుండుటఁ జూచి వెఱతుమనియు మనల నెప్పుడు నందుఁ బోనీయఁ గూడదని తద్వారరక్షకుల కాజ్ఞాపించిరి. అందుఁ బోయి వారిచే నాటంక పెట్టఁబడ నేల? యని యట్లంటిని. మీకడ రహస్యములుండునా?

విక్ర - అమ్మవారి యాకారము చూచి వెఱచుటకు మనమంత చంటిపిల్లలమా? మన మీదగలము తటాకము లోతుగానున్న నేమి? దీనికి వే రెద్దియో కారణ ముండునేమో భట్టీ విచారింపుము, శ్రీధరా! నీ వెప్పుడైన నాలయము లోపలికి బోయి చూచితివా?

శ్రీధ — పలుమారు మా తండ్రితోఁబోయి చూచితిని.

విక్ర - లోపల నేమి వింత లున్నవి?

శ్రీధ - అమ్మకచెల్లా! కన్నులు పండువుగా నుండును. మన కోటవలె జుట్టుఁ బ్రహరి యెత్తుగా నున్నది. తూరుపున నుత్తరమున ద్వారములున్నవి. లోపల గోడ నంటి చండికాలయములు కాంచనమణిశిఖర శోభాదగద్ధగితములై వేయికి మించి యున్నవి. శాంతకుంభస్తంభవిభ్రాజమానంబులగు కళ్యాణమంటపములు నూఱునకుఁ దక్కువ యుండవు. కాంచనధ్వజస్తంభములు కింకిణీచయాంకితములై తాళవృక్షముల వలె నందందు స్థాపింపబడియున్నవి. మఱియు నమ్మవారి ముఖమంటపశిఖరంబులు నవరత్నశిలావినిర్మితంబులై కన్నులకు మిరిమిట్లు గొల్పుచుండును. అందు రాత్రుల నొకదీపమే సహస్రదీపములవలె మణులఁ బ్రతిఫలించి కనంబడుచుండును.

ఏఁడు ముఖమంటపములు దాటి లోపలికిఁ బోయిన మహాకాళి విగ్రహము భయంకరాకారముతో నోరు దెఱచుకొని, అగ్నిజ్వాలవలె వ్రేలాడు నాలుకతో ధవళశూరాభమ్ములగు దంష్ట్రలతోఁ గనంబడును. భద్రుఁడనినట్లు హటాత్తుగాఁ జూచిన వెఱపుగలుగక మానదు. కపాలమాలికలు వ్రేల నవరత్నోజ్వల భూషణములచే నలంకరింపబఁడి కాలిక్రింద దేనినో త్రొక్కిపెట్టి సింహముపైఁ గూర్చుండునట్లాశక్తి విగ్రహ మొప్పుచున్నది. ఆ గుడికి దక్షిణ దెస నానాకుసుమ ప్రసవతరులతావిజనములచే నొప్పు పుష్పవనము నాటఁబడి యున్నది. ముఖమండపమున కల్లంతదవ్వులో విశాలరమణీయమగు తటాకము విరాజిల్లుచున్నది. నాలుగుదెసల స్పటికశిలాసోపానములు గలిగి కువలయుకమలకల్హారవాసనలు నాసాపర్వము గావింప మధుఝంకారముఖలితంబైన యొక్క కొలను తూరుపుతీరమున సమున్నతశాఖాసమాచ్ఛాదితతటాకార్ధభాగంబై మఱ్ఱివృక్షం బొండు ప్రకాశించుచున్నది. ఆ సరసిలోఁ