పుట:కాశీమజిలీకథలు -09.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

176

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గావించుచున్నాను. అని యెట్లు నోయినదో మీకు దెలిసినదియా? అని యడిగిన మహేంద్రుఁ డిట్లనియె.

నికషుపట్టి! నే నట్టివాని కొరకు గట్టి ప్రయత్నమే చేయుచుంటిని. పుణ్యలోకము లన్నియుఁ గాపు పెట్టించితిని. మా దూతలు నిన్ననే పిశాచలోకములో నా దొంగం బట్టికొని తీసికొని వచ్చినారు. ఆ పెట్టెలో నున్నాఁడు. చూడుమని పలికిన విని నిరృతి వెఱఁ గందుచు నేనున్న పెట్టెకడకు వచ్చి సందులనుండి తొంగి చూచి యోరీ? నీ వెవ్వండవు. పిశాచలోకమున కెట్లు వచ్చితివి? తీర్థశుల్క నెత్తికొనిపోయినవాఁడవు నీవేనా? నిజము జెప్పుము. నిక్కము చెప్పిన విడిపింతు. లేకున్న దండింతురని యడిగిన విని నేను చెతులు జోడించి, అతండు నీకు మామయని యెఱింగిన కతంబున నెడద నుదుటు గదుర నిట్లంటి.

మహాత్ములారా! మీకడ నసత్యము లాడుదునా, పులిని జూచి నక్కవాతఁ బెట్టుకొనిన దన్నట్లు నాపనియైనది. వినుండు. మహేంద్రనగరాధీశ్వరుండగునింద్రమిత్రుండను రాజునకు జగన్మోహనుండను పుత్రుం డుదయించెను. నేను వాని మిత్రుండ సిద్ధార్థుఁ డనువాఁడ. నా మిత్రుఁడు సిద్ధతలోషధిప్రభావంబునఁ దేజోలోకంబునఁ కరిగి యందు దీర్థశుల్కం గూడికొని యటనుండి నిరృతిలోకమున కరిగి యందానుజనాధుని పుత్రికచే స్వయంవరమున వరింపఁబడి యిద్దరి భార్యలతో నింటికి వచ్చెను.

వాని వైభవముఁ జూచి నేను నాసిద్ధు నాశ్రయించి పాదలేపనము సంపాదించి యా నక్షత్రలోకమున కేగితిని. నా దురదృష్టవశంబున నది పిశాచలోకమైనది. అందున్న వారలు నన్నుఁజూచి బెదరించుచుఁ గట్టి యీ బోనులోఁ బెట్టి యిక్కడికిఁ దీసికొని వచ్చిరి ఇదియే నా వృత్తాంతము. తీర్థశుల్కను నే నెత్తుకొనిపోలేదు. నిజము చెప్పితిని, నన్ను విడిపింపుడు, మా దేశమునకు బోయెద. పూర్వజన్మమున సుకృతము జేసికొనలేదు. పుణ్యలోకంబుల జూచు భాగ్యమైన బట్టినది కాదు అని దీనుండనై వేడికొనగా నా కథ విని యింద్రుండు నిరృతి కిట్లనియె.

దానవేంద్రా! ఇది యేమివింత! వీడు చెప్పిన యుదంతము నిజమేనా? తీర్థుశుల్క నెత్తికొని వచ్చిన వానికే నీ కూతుం బెండ్లి జేసితివా? మాకు గొంచమైన జెప్పితివి కావేమని యడిగిన నతం డిట్లనియె.

మహేంద్రా! నీకా వృత్తాంతము జెప్పుటకే నే నిప్పు డరుదెంచితిని. అందులకే తీర్థశుల్క నెత్తికొనిపోయిన దొంగం బట్టించితినని మీరు చెప్పిన వింతపడి నేనడిగితిని. వీడు చెప్పిన కథయంతయు సత్యమైనదియే. గంగామహాత్మ్యద్యోతరమగు నీ యుదంతము చమత్కారరూపమువలె నొప్పుచున్నది. వినుండు ఆ తీర్థశుల్క వెనుకటి తీర్థశుల్క కాదు. కపిల యను రెడ్డికోడలు వానిని వరించి ఇల్లు విడిచి వాని వెంటబడిపోవుచు దైవికముగా గంగలోబడి మృతి నొందినది.