పుట:కాశీమజిలీకథలు -09.pdf/158

ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

163

మున నున్నవారని తెలిసినంత నే ననుగమించి వెంటరా, నిరృతి యతిరయంబున హజారమునకు జని యందున్న రక్కసులను దేవదూతలం జూచి వీరెక్కడ దొరకిరని యడిగిన నా దేవదూత లిట్లనిరి.

నిరృతి మహారాజా! తీర్థశుల్కను రక్కసులే యెత్తకొని పోయిరని నిశ్చయించి మహేంద్రుడు పుణ్యలోకములకెల్ల గాపుపెట్టించి మీలోకము చుట్టును దిఱిగి పరిశీలింపుచుండుడని పెక్కండ్ర దేవభటుల కాజ్ఞాపించి యున్నాఁడు.

మేము కొందఱము పాతాళముకు బోవు మార్గములో గాచికొనియుంటిమి. వీండ్రీ తెఱవ మొఱవెట్టుచుండ సీతను రావణుండువోలె నీదుర్దముండు భుజముపై నెక్కించుకొని వీరు మువ్వురు వెంటరాఁ బాతాళలోకమున కేగుచుండఁ బట్టుకొని రెక్కలు విరిచికట్టి మీకడకు దీసికొనివచ్చితిమి. వీండ్రను మీరే శిక్షింతురా? మహేంద్రుఁ నొద్దకు దీసికొనిపోదుమా? అని యడిగిన నతం డిట్లనియె.

మీరు చేసిన పనికి జాల సంతోషమైనది. వీరిని నేనే శిక్షించెదను. తీర్థశుల్కను వెనుకనుండి పంపించెద. మీరిప్పుడు పొండని చెప్పునప్పటికి నాగుండె నిలఁబడినది. తీర్థశుల్కను వారివెంట బంపివేయు నేమోయని తటతట లాడుచుంటిని. ఒండొరుల మొగము జూచికొని కన్నీరు గార్చుచుంటిమి. దేవదూతలు నిరృతి సెలవుపొంది యఱిగిన తరువాత నతఁ డామెను దన కూఁతు నంతఃపురమున కనిపి యా రక్కసుల కెక్కుడు శిక్షవిధించి యేకాంతముగా నన్నుఁ జేరి యిట్లనియె.

మోహనా? నా కూఁతురు దేవతల విడిచి మనుష్యుఁడవైన నిన్ను వరించినదని రాక్షసు లాక్షేపించుచున్నారు. అందుల కించుకయు నేను జింతింపను. తీర్థశుల్కకు నీకు నెట్టిసంబంధము కలదో ఇదియు నట్టిదేయని తెలిసికొమ్ము. ఇఁక నీ యొద్ద దాచనేల? నా పుత్రికను నిట్టివాని వరించితివేల యని గట్టిగాఁ నిర్బంధించి యడుగఁగా జిట్టచివఱ కది యున్నగుట్టు జెప్పినది. వినుము. తాను వెనుకటిజన్మమున భీమసేనుడను పుడమిఱేని కూఁతురు జంద్రికయనుదాని ననియు గాశీనికటంబున గంగాగర్భంబున మృతినొందిన పుణ్యవిశేషంబున నీ పట్టినై పుట్టితిననియు మరణసమయంబున నా జగన్మోహనుడే పతి గావలయునని కోరికొంటిని. కావున విశ్వనాధుండే వాని నిచ్చటి కంపె. నతనినే వరించితి నని సమాధానముఁ జెప్పినది. నీవు జెప్పినవృత్తాంత మాయుదంతమునకు సరిపడినది. ఇది దైవసంకల్పితము. దైవఘటనములఁ దప్పింప నింద్రాదులకు శక్యముకాదు. తీర్థశుల్కయు విద్యావతియు దొల్లిటిజన్మంబున యోగినులై యీ జన్మంబున నిన్ను బతిఁగా బడసిరి. ఇది కాశీతీర్థసంసేవన గలిగిన ఫలము.

భూలోకంబునఁ గాశీపురంబు సేవించిన వారికి గల్పవృక్షము వలెఁ గామితము లీడేర్చుచుండ మనుష్యులకుఁ గొదవయేమి యున్నది? అట్టి పుణ్యక్షేత్రంబు భూమధ్యంబున గలిగియుండ మానవులు యమలోకంబున కేల బోవలయునో