పుట:కాశీమజిలీకథలు -09.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

148

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    బల్కరించినఁ గుడ్యభాగాంతరస్థయై
              యొకతె యుత్తరమిచ్చు నొకచోట
    నొక్కతావున మీటఁ ద్రొక్కినఁ దుంపురుల్
             మొగలుగా వ్యాపించి ముసురువట్టు
    నొక్కచోటఁ జంద్రకాంతోపలప్రభ లడ్డు
             తెరలాగఁ బవలు వెన్నెలలు గాయు
గీ. నొక్కచో దీపమాలిక లుద్భవిల్లి
    మరను ద్రిప్పంగ నంతలో మాయమగును
   ఇంద్రజాలము వోలె నా యింటిలోన
   గలవ దెన్నేని వింతలు దెలుపవశమె।

వయస్యా! వినుమనంతర మేనొక తల్పాంతరమున వసించి తత్ప్రాంతమున నిలువంబడి లజ్జాక్రాంతస్వాంతయై యోరచూపుల నన్ను జూచుచున్న యా యన్నుమిన్న నొయ్యన్న శయ్యపై దాగికొని బాహ్యకేళీలాలసుండ నగుటయు నా కుటిలకుంతల కరతలంబులు జోడించి మనోహరా! వినుండు.

క. నానోములు ఫలియించెం
   గా నేఁటికి నేను బడిన కష్టము వోయెం
   బ్రాణేశ ధన్యనైతిం
   బో? నీ యాశ్రయము నేఁడు బొందిన కతనన్.
 
అని నుతించుటయు నేను మందహాసము జేసి,

క. ఓహోహో! నీవేశ్యా
   వ్యాహారంబులను నమ్మువాఁడొనొకొ? వరా
   రోహా ? ఇదివఱకిట్టి మ
   నోహరు లెందఱిని దగఁగనుంగొంటివొకో?

ఇఁక ముందెందఱు గానున్నారో. అందఱిలో నేనొక్కరుండ మీ వలపులు జలముల వ్రాత యని యాక్షేపించిన నమ్మించుబోఁడియు నమ్మిక బుట్ట నేనట్టిదానను గాను. ఇదివర కన్యుని ముట్టి యెఱుఁగ. మీ పాదములతోఁడుఁ మీ కన్న నొక వాసరము వెనుకనే యీ భవనమున కరుదెంచితిని. మిమ్మే ధ్యానించుచుంటి. నా యుదంతంబు ముందు మీ కెఱింగించెద నిప్పుడేమియు నడ గవలదు. అని నమ్మిక పలికిన విని నే నానందపరవశుండనై యప్పు డప్పడఁతితోఁ గూడ ననంగక్రీడాపారావారతరంగములఁ దేలియాడుచు మూఁడు దినము లొక్క గడియవలె వెళ్ళించితిని.

నాలుగవనాఁ డుదయమునకు దేవలోకమునుండి మణిభద్రుఁడు వచ్చుటయుఁ జూచి సీమారక్షకుఁడు ఓహో! నీవింత యాలసించితివేల? పుణ్యపురుషుండు వచ్చి మూఁడు దినములైనది. తీర్థశుల్కంగూడి భోగము లనుభవించు చున్నవాఁడు.