పుట:కాశీమజిలీకథలు -09.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

19]

తీర్ధశుల్క కథ

145

గలడు. అని తలంచుచు నోయీ? నీవు వోయి పరివారముల దీసికొనిరమ్ము. పొమ్మని యాజ్ఞాపించితిని.

అతండరిగిన రెండుగడియలకు భేరీశంఖకాహళవేణువీణాదినినాదములతో నొకయుత్సవము నాచెంతకు వచ్చుచున్నట్లు కనంబడినది. నవరత్నస్థగితమగు విమానము మహాసౌధమువలె నంతరము గలిగియున్నది. దాని ముందర మంగళవాయిద్యములు దాని వెనుక నప్సరోనృత్యములు నొకప్రక్క గంధర్వుల సంగీతము వేఱొకప్రక్కఁ గిన్నరుల వీణాగానములు వెలయ దాసదాసీజనంబులు నవ్విమానమును గమించి వెనుక నడుచుచుండ నది యంత్రరథమువలె నాచెంతకు వచ్చుచుండెను. ఆ దేవయానము నడుమ రెండురత్నపీఠము లమరింపఁబడియున్నవి. ఎడమ పెట పీఠముపై దివ్యాభరణభూషితయై తీర్థశుల్కయను దేవకాంతఁ గూర్చుండియుండెను. ఇరువురు గంధర్వకన్యకలు వింజామరల బూని యిరుప్రక్కల నిలవంబడి యుండిరి.

ఆ విమానము నాఁకు బదిబారలలో వచ్చి నిలువంబడినది. అప్పుడు దివ్యరూపసంపన్నులగు గంధర్వకన్యక లాతీర్థశుల్క పరిచారికలు నూర్వురలోఁ గొందఱు ముందర వచ్చి కిన్నరకంఠులు మంగళహారతులు పాడుచుండ నొకతె పాదములు గడిగినది. ఒకతె చేలాంచలంబునఁ దడియొత్తినది. మఱియొకతె పాదుకలు దొడిగినది. ఇరువురు మంగళహారతు లిచ్చిరి. కొందఱు స్తుతిగీతములఁ బాడిరి. కొందఱు వింజామరల వీఁచిరి. కొందఱు పీతాంబరములు దాల్పఁజేసిరి. నూత్నాంబరాభరణాదులచేఁ గొందఱు నాకలంకరించిరి. కొందఱు గంథము బూసిరి కొందఱు శిఖకు మందారదామములం జుట్టిరి ఈ రీతిఁ దలయొక యుపచారము జేసినపిమ్మటఁ దీర్థశుల్క యవ్విమానము దిగివచ్చి దాదులు రత్నపుగొడుఁగు బట్ట నా పాదములకు నమస్కరింపుచు నీవే నా భర్తవని వరించి నా మెడలోఁ బుష్పదామంబు వై చినది. అందఱు కరతాళములు వాయించిరి. పిమ్మట నా చిటికెన బట్టికొని యవ్విమానము మీఁదికిఁ దీసికొనిపోయి కుడివైపు పీఠముపైఁ నన్ను గూర్చుండఁ బెట్టినది. రెండవ పీఠముపైఁ దాను గూర్చుండెను. గంధర్వకన్యక లిరువంకల నిలువంబడి చామరములు వీచుచుండిరి.

అప్పుడా విమానము గిరుక్కున మరలి పట్టణాది ముఖముగా నడుచుచు నడుమ నడుమ నాగుచుండెను. ముందర గంధర్వకన్యక లొకమేళము, కిన్నరు లొకమేళము అప్సరస స్త్రీ లొకమేళము, మూఁడుమేళములు నా విమానము ముంగల నడచుచుండెను. ఒక్కొక్కమా ఱొక్కొక్కమేళము వంతులుప్రకార మాడుచుండును. అట్టి వైభవము ఎట్టి పుణ్యాత్మునికిఁ గలుగునో! ఆహా! ఆ వైభవము చూచిన దంతయుఁ జెప్పుట గష్టముగా నున్నది. ఆవైభవము చూచినవారికి మన భూలోకము తలంచికొన నరక మిదియే యని తోచకమానదు. భూతల మంతయు వెదకి చూచినను పురిలో దాసికి దాసిగానున్న యువతిని బోలిన జవరాలు గాన్పింపదు. పరిచారిక