పుట:కాశీమజిలీకథలు -07.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

కాశీమజిలీకథలు - సప్తమభాగము


జితవతికథ

ధరాతలంబున సుప్రసిద్ధమగు విశాలాపురంబున సుశీనరుండను మహారాజు ప్రజలం బాలింపుచుండును. ఆ నృపతికి జితవతియను కూఁతురుగలదు. అయ్యువతీమ తల్లి, సౌందర్య ఖనిగా, సుగుణరాశిగా, లావణ్యపుంజముగా, కళాకలాపముగా, భూలోక లలనా లలామముగా నుండనెంచి వివరించి యతిప్రయత్నమున సృష్టించెనని చేయి యెత్తి శపథముజేసి చెప్పవచ్చును. విద్యారూప గుణగణంబుల భూలోకకొక స్తనుల నెల్ల జయించినదగుట నయ్యువతికి జితవతియని పేరిడిరని తలంచెదను.

ఆ బాలామణి యొకనాఁడు రాత్రి పండు వెన్నెలలు గాయచుండ నిజప్రాసాదోపరిభాగంబున మణికుట్టిమంబున జ్యోత్స్నావితానంబులు ప్రతిఫలించి వింతకాంతులీన ననూనడానకళా ప్రవీణలగు అలివేణులతోఁ గూడికొని వినోదముగా సంగీత ప్రసంగంబునఁ గాలము గడుపుచున్నంత రోహిణియను నేకాంత సఖురాలు జితవతిం జూచి యిట్లనియె.

భర్తృదారికా ! ఇపు డర్థరాత్రమైనది. ఈ శీతకరుని కిరణజాలంబు హృదయాహ్లాదము గావింపఁ గానామృతము శ్రవణంబులఁ గ్రోలుచున్న మనకు కాలపరిణామ మించుకయుం దెలిసినది కాదు. ఇఁక విపంచింగట్టి నిదురింపంబోదమే అనుటయు జితవతి జవ్వనీ ! భగవంతుండగు రోహిణీవల్ల భుని చల్లని కిరణంబుల విడచి వెళ్ళుట కుల్లం బొల్లకున్నదికదా? ఆహా! అమృత కిరణుండన కతనికే చెల్లుఁబో. ఈ యోషధీశుని ఘృణిగణంబులు సోకినంగాని పంటలు పండవఁట సకల లోకాహ్లాదకరుం డగు నీ హిమకరుని మహిమాతిశయం బించుక స్తుతి యించిపోవుటమంచిదిని యాజ్ఞాపించినది. అందఱునిందు బింబాముఖలై

               స్రగ్విణి వృత్తము
    రోహిణినాధ! కారుణ్యవార్దీ! సుధా
    వాహినీశాత్మజా భర్గచూడామణీ!
    రాహువైరీ! నిభారమ్య సౌమ్యాకృతీ!
    పాహిమాం పాహిమాం పాహిజై వాతృకా॥

భక్తిపరవశమై కన్నులు మూసికొని స్తుతియించుచున్న జితవతి దోసిటఁ బటుకాంతి స్ఫుటమణి ప్రభా ధగద్ధగితమై యొక మండనం బంతరిక్షంబునందుండి తటాలున జారిపడినది. అప్పుడమ్మదవతి అదరిపడి మృదుకరపుటం బమ్మణిభూషాపతన తాడనంబున కోపమి నేలబడ వదలినది. అయ్యదరుపాటుంజూచి యందున్న బోఁటు