పుట:కాశీమజిలీకథలు -07.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చూచినంత నామె అందు గనఁబడలేదు. వేగముగా మేడమెట్లుదిగి పశువులసాలకడ కరిగెను. అప్పుడు యాచిన్నది రాజుచెంత కరిగినది. ఆమె నందుచూచి గురుదత్తుఁడు కాచికొనియుండెను.

పద్మిని పాదధ్వని విని రాజు తొందరఁజెందు డెందముతో సుందరీ! యిందు రమ్ము. నేనిందు వేచియుంటి గడియ యుగమగుచున్నది. అనిమెల్లగాఁ బిలిచెను.

పద్మిని దాపునకుఁబోయి తడుముచు నెడమచేతితో వానిశిరము పట్టుకొని వంచి గురిచూచి కుడిచేతనున్న పెద్దకత్తితో వానికంఠముపై పెద్దవ్రేటు వైచినది. హా ! చచ్చితిని. హా ! చచ్చితిని. అని వికృతస్వరముతోఁబలికి యాపాపాత్ముఁడు గిలగిల కొట్టికొని ప్రాణములు విడిచెను. అయ్యార్తధ్వనివిని గోమిని భయపడుచుఁ దలుపుతీసికొని లోపలికి వచ్చి దేవా? దేవా? అనిపిలిచి అతండు కొట్టుకొనుచుండఁ బరికించి తన్నుఁగూడ జంపుదురని వెరచికాలికొలఁదిపారి యింటికిం బోయినది.

గురుదత్తుఁడు భార్యచేసిన సాహసము కన్నులారా చూచి వెరగుపడుచుఁ దటా లునవచ్చి కౌఁగిటవానిపట్టి కత్తిలాగికొని ప్రమూదము ప్రమాదము చేసితివని గద్గదస్వరముతోఁ బలికెను‌.

భర్తంగురుతుపట్టి యాశెట్టిపట్టి అయ్యో మీరిక్కడి కెట్లువచ్చితిరి? నాయుద్య మమున కంతరాయము గావించితిరేల? విడువుఁడు విడువుఁడు. ఈక్రూరుని శిరంబు ముట్టితి జీవనముల విడిచెదనని పలికిన ఆతఁడిట్లనియె.

ప్రేయసీ! ఆత్మహత్య మహాపాతకముగాదా? యిట్టి కృత్యమున కుద్యోగించితి వేల? వీఁడెవ్వఁడు? ఇక్కడికెట్లువచ్చెను. వీని నేమిటికిఁ జంపితివని యెరుఁగనివాడుఁ వలె నడిగిన జరిగిన కథ అంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి అప్పుడంతి తన్ను విడు వుఁడని బ్రతిమాలినది.

అతండు నవ్వుచుఁ బువ్వుఁబోణీ? లోకకంటకుండగు నీ రాజుంజంపి యుప కారము జేసితివి. ఇది నీకు పాపము కానేరదు. కీర్తికే హేతువగును. తొల్లి ద్రౌపది సింహబలుని జంపించలేదా? దాననామె కేమిపాపమువచ్చినది. ఉడుగుము. పదపద అని పలికిన నక్కలికి నాధా! మనమీతనిని జంపినవార్త విదితముకాకమానదు. రాజ పురషులు మనల విడుతురా? నేనిందులకు బరియయ్యెద. మీరు సుఖింపవచ్చునని చెప్పిన నతండు చాలు, జాలు. నీవులేని సుఖము నేననుభవింతునా? భయము విడువుము. మనము దేశాంతరమరిగి సుఖింతము అని యేమేమో యుపాయములం జెప్పెను. ఆమెయు నంగీకరించినది.

అప్పు డిద్దరు రాచపీనుగను సాయముబట్టి వీధిలో దూరముగా బారవైచిరి.