పుట:కాశీమజిలీకథలు -02.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

14

కాశీమజిలీకథలు - రెండవభాగము

అంత సాయంకాలమున నమ్మనుజపతి వేటకాండ్రు చుట్టునుం బరివేష్టించి వేటకనుజ్ఞ యెప్పుడెప్పుడని తొందర పెట్టుచుండ నయ్యాటవికులం జీరి యోరీ! యా సింహ మెక్కడ నున్నది? యెప్పుడు వచ్చును? దాని చిహ్నము లెట్టివి యెఱింగింపుఁ డని యడిగిన వాండ్రు మొక్కు చేతులతో నిట్లనిరి దేవా! దేవరతో మనవి చేసికొని వచ్చినది మొదలు మా కామెకము గనఁబడుటలేదు. మీరాక విని వెరపున పారిపోయెనని యూహించుచున్నారము. అది యదిగో కనఁబడుచున్న గొందిలో నెప్పుడును గద్దెవైచుకొని కూర్చుండునది. యీ వేళకు నిందుఁజేరువారు యమునిచేరువారేయగుచుండిరి. కటకటా! మేము పడిన యిడుములేమని వక్కాణింతుము. నేఁడుగదా మా యాలుబిడ్డలం గూడికొంటిమి. మావింటికడిందియడర నియ్యడవియంతయు దడవి దానిని గడతేర్పుఁడు. ఎక్కడనో యడఁగియున్నదని వేడుకొనిన వారిమాటలు విని నవ్వుచు రాజశేఖరుండు వేటకాండ్ర కిట్లనియె.

ఓరీ! యా కేసరి మనరాయిడికోడి యెందేని నణగిఁయుండవచ్చును. విచ్చలవిడి నీరేయియంతయు నడవినెల్లడలఁ గలచి యలజడి సేయుఁడు ఉరులఁ బన్నుఁడు. వలల నొడ్డుఁడు, మఱియుం గ్రూరసత్వంబుల సత్వరంబునం బరిమార్పుఁడు. కుక్కల నుసిగొల్పుఁడని యానతిచ్చినంత సంతోషముతో వాండ్రందరు గాండ్రుమని యఱచుచు నొక్కుమ్మడి నయ్యడవియంతయుం జెలరేగి హల్లకల్లోలము చేయదొడఁగిరి.

అప్పుడా చప్పుడులకు వెఱచి యఱచుచుఁ బరచు మృగమ్ముల యెలుంగులు విని బెదురుఁగదురఁ దన్నుఁ గౌఁగలించుకొనిన చంద్రసేనను బిగియంబట్టి స్వయంగ్రాహసుఖపారవశ్యం బేపార నారాజశేఖరుం డారమణీమణి కుదుటుఁగఱపుచు నాశిబిరంబునఁ దదీయలీలావిశేషంబులతో నారాత్రియంతయుం దృటిగా వెళ్ళించెను. అంత నిశావసానంబగుటయు భార్యయుం దానును వందిమాగధసంస్తపరవంబుల మేల్కాంచి సమయకరణియములం దీర్చి రమణీయంబగు ప్రదేశంబున బ్రాతఃకాలమందమారుతమ్ములు మేనికిహాయి సేయ నుచితాసనంబులంగూర్చుండి యక్కాననసౌభాగ్యంబరయుచున్న సమయంబునం దళవాయి యరుదెంచి ఫాలంబునం గరయుగంబు గీలు కొల్పుచు నిట్లు విన్నవించెను.

దేవా! దేవర యనుమతి రాత్రియంతయు నీయరణ్యంబున గల మృగముల నరసి వేటాడితిమి పెక్కుమృగంబులం జంపితిమి. పెక్కుజంతువులం బట్టితిమి. పెక్కు మెకంబులం దోలితిమి మాయిచ్చవచ్చినట్లెల్ల నీయడవి నల్లరిఁజేసితిమి. కాని యెందును వాండ్రనిన సింగము చిక్కినదికాదు. అది నిక్కముగా నెక్కడికో పోయినది లేకున్న మాకు దొరకకపోదు. పెక్కేల నిక్కాననములోనున్న సత్వరంబు మాసత్వంబునకు దాటినది యొక్కటియులేదు. దేవర తలపూవువాడకుండ నశ్రమం