పుట:కాశీమజిలీకథలు -02.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతపుష్పము కథ

81

రాజపుత్రిక లిట్టి అర్థరాత్రమున నొరులమేడలకు సంగీతము వినుటకు వచ్చిన దప్పుకాదా? కానిమ్ము. మిగుల వచ్చినదిగదా తీసికొనిరమ్మని చెప్పిన విని యప్పడతిపోయి వసంతతిలకను బ్రవేశపెట్టినది తదీయ సౌందర్యాతిశయము నాకే విస్మయము గలుగజేసినది. అప్పుడు నే నాయింతిని గూర్చుండ గనుసన్న జేసితిని. ఆకోకస్తని నాకు నమస్కరించి కూర్చున్న యనంతరంబు నేను మనోహరముగా మోహనరాగముబాడి అచ్చేడియను మోహనివశం జేసితిని.

అప్పు డప్పడతి సిగ్గువిడచి సఖురాలితో ముదితా! ఇతడు రాగంబున మదనుండువోలె మదవతుల హృదయములు భేదింపుచున్నాడు. ఈతప్పునకు గట్టింతు మని చెప్పుమని ఏమియో పలికి మదనవికారములు నాయెదుట నభినయించిన నేనును మందలింపుచు బెద్దవారుండ గన్యకలు స్వతంత్రింపరాదు. తొందర యేమి వచ్చినది. వలదు వల దుడుగుమ‌ని యమ్మగువ యపస్మారవికారములు గుదురుపరచి సానునయముగా జెలికత్తెయతో గూడ నంపితిని.

అది యంతయు వారిపెద్దలందరు నెరింగిన కపటము కాబోలు? ఆమరునాడే రాజు నాయొద్దకువచ్చి మెల్లన నిట్టనియె. ఆర్యా! నాకు బుత్రసంతతిలేదు. వసంతతిలకయను కూతురుమాత్ర మొక్కతెగలదు అదియు విద్యాగుణరూపంబుల నీకుదగినది. దాని పాణిగ్రహణము సేసికొని యీరాజ్యభారమంతయు వహించి నీవు పాలింపుము. నేను పెద్దవాడనైతిని. ఇది నాయభీష్ట మందులకే నిన్నీయూరు దీసికొనివచ్చితి నని పలికినవిని నే నేమియు బలుకనేరక సమ్మతించిన వానివలె నభినయించుచు లజ్జావశంబున నూరకుంటిని. అంత నా వసుంధరాకాంతుండు మిగుల సంతోషించుచు నాసన్నశుభముహూర్తమున మిగుల వైభవముతో నాకా వసంతతిలక నిచ్చి వివాహము గావించెను. నే నేమిటికి నప్పూబోడిని బెండ్లియాడితినో నాకే తెలియదు. లోకములో నెట్టివారును సంకల్పపూర్వకముగ బనులు చేయుదురుగదా? నేనట్లు చేయకపోవుటకు విధినియామకముతప్ప వేరొండులేదు.

శ్లో॥ అఘటితఘటితానిఘటయతి ఘటితఘటితాని దుర్ఘటీకురుతే
     విధిరేవతానిఘటయతియాని పుమాన్నైవచింతయతి.

ఈ శ్లోకమును పలుమారు పఠించుకొనుచు నీరాజ్యలక్ష్మితో గూడ వసంతతిలకను స్వీకరించితిని. మరియు నత్తరుణితో గలసికొనినప్పుడు యుక్తియుక్తముగా నిట్లంటి. మదవతీ! నీతో మొదట నొకసంగతి చెప్పుట మరచితిని. అది యిప్పడు జ్ఞాపకమువచ్చి మిగుల చింతించుచుంటిని. నేను బెండ్లి యయిన సంవత్సరములోపల భా‌ర్యను గలిసిన మృతినొందుదును. పూర్వము నా కొకయపరాధమూలమున నిట్టిశాప మొకసన్యాసి యిచ్చెను. అంతదనుక నే నెంత బ్రతిమాలినను నీవు సమ్మతింపవద్దు