పుట:కాశీమజిలీకథలు -02.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

78

కాశీమజిలీకథలు - రెండవభాగము

సభచేయుదుమనియు నందుగూడ దమ విద్యామహత్వము జూపి మ మ్మానందింపచేయవలయునని ధర్మాంగదమహారాజుగారు నన్ను ప్రార్ధించిరి.

దీనికింత నన్ను స్తుతిసేయవలదనియు నట్టి ప్రసంగములకయి ఎన్ని దినములుండుమనిన నుందుననియు దీనికే నేను దేశాటనము చేయుచున్నాననియు జెప్పితిని. అంతటితో నాటిసభముగించిరి. అంత మరునాడు మధ్యాహ్నమే యాసమాజ మారంభమయినది. అదివరకు నాప్రఖ్యాతి విని యాదినమున జరుగబోవు ప్రసంగముల జూచుటకు బాలవృద్ధముగా వేలవేలు జను లాసభకు వచ్చిరి. అందు దిగ్దంతులను ప్రసిద్ధిగలిగి యనేక రాజసభలలో జయపత్రికలు గొన్న మహాపండితులు నలుగురు నాతో బూర్వపక్షసిద్ధాంతములుసేయ నిరూపింపబడిరి. వారికి నన్ని విద్యలలో బరిశ్రమ గలిగియున్నది. ఒక్కొక్క శాస్త్రమునందు రెండుమూడు పూర్వపక్షములుచేసి యోడంబుచ్చి వారు చెప్పినది తప్పనియు నేను జెప్పినది యొప్పునియు వారిచేతనే యొప్పించితిని. అప్పుడు నావాదనైపుణ్యము బూర్వపక్షసిద్ధాంతముల చాతుర్యము ప్రశాంతతాబోధత్వము గ్రహణధారణలపొందు లోనగు నాప్రజ్ఞలజూచి నాప్రతివాదులే నన్ను స్తుతిజేసిరి. అప్పుడు మదీయాద్భుత విద్యావైశారధ్యమునకు మెచ్చుకొనుచు ధర్మాంగదుండు చండవర్మ మొదలగు రాజులు దమలోనెద్దియో యాలోచించుకొని స్తుతివాక్యపురస్సరముగా నాకిట్లనిరి.

రాజకుమారా ! నీవమానుషప్రభావము గలవాడవు. నీవిద్యలన్నియు నట్టివే. మరియు విశేషించి నీరూపమువలెనే సంగీతము త్రిలోకమోహజనక మైనది. ఈ విషయములచే మాకు మిగుల నానందము గలుగజేసితివి. ఇట్టి నీకు బారితోషికమిచ్చుటకు మాయొద్ద దగిన వేమియును లేవు. మారాజ్యమంతయు నిచ్చినను నీవిద్యకు బ్రతికాదు. నీవిద్య జగత్ప్రకాశమైనది. దానికితోడుగా నిట్టి మహిమగల యీఫలపుష్పములు రెండును నీయొద్దనుండినచో బంగారునకు పరిమళము గలిగినట్లుండును. భగవంతుడుసైతము భక్తితో వచ్చిన ఫలపుష్పములచేతనేకదా సంతసించును. నీవును అట్లే సంతసింపవలయునని పలుకుచు నా ఫలపుష్పములు రెండును నాకిచ్చిరి.

వానిని నేను వినయపూర్వకముగా స్వీకరించి వారితో నిట్లంటిని. అయ్యా! మీరు నా కివి ప్రసాదపూర్వకముగా నిచ్చితిరి వీని వృత్తాంతము నిన్న సభలో గూర్చుండి వింటిని. ఆ బ్రాహ్మణులకు గరుణాపూర్వకముగా నెవరో యిచ్చిరి. వారి నపారధనికులుగా జేయుట వారియభిప్రాయమై యుండవచ్చును. కావున ముందు వారికి దగిన ధనమిచ్చి సంతసపరుపవలయునని బలికితిని. నా మాటలు విని వారందరు మిగుల సంతసించుచు నాబ్రాహ్మణులకు జెరియొక యగ్రహారము నిచ్చిరి. నేనాధర్మపురిలో నున్నప్పు డెప్పుడేని విహారార్థమై రాజమార్గంబున నడిచితినేని నా చుట్టునుం బెక్కండ్రు చుట్టుకొని యపురూపముగా జూచుచు దేవునికివలె నాకు వందనములుచేయుచు స్తుతి చేయ దొడంగుదురు. ఆ గ్రామమందే యొకమాసము వసించితిని. ఒకనాడు నా